India Omicron cases: దేశంలో ఒమిక్రాన్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, కేరళ, ఛండీగఢ్‌లో తొలి కేసు నమోదు కాగా.. కర్ణాటకలో మూడో కేసు, మహారాష్ట్ర నాగ్‌పుర్‌లో ఓ కేసు వెలుగులోకి వచ్చింది. ఫలితంగా దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 38కి చేరుకుంది.
కేరళలో తొలి కేసు..
యూకే నుంచి కేరళ కోచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ సోకింది. ఈనెల 6న రాష్ట్రానికి వచ్చిన అతడికి పరీక్షలు చేయగా.. కొవిడ్ పాజిటివ్ అని ఈనెల 8న నిర్ధరణ అయింది. జీనోమ్ సీక్వెన్సింగ్‌లో ఒమిక్రాన్ వైరస్ సోకినట్లు తేలింది.
First Omicron case Chandigarh:
ఛండీగఢ్‌లో 20 ఏళ్ల యువకుడికి ఈ కొత్త వేరియంట్ సోకిందని అక్కడి వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నగరంలో నమోదైన తొలి ఒమిక్రాన్ కేసు ఇదేనని స్పష్టం చేసింది.
బాధితుడు ఇటలీ నివాసి అని అధికారులు తెలిపారు. భారత్‌లో ఉన్న బంధువులను చూసేందుకు ఇక్కడకు వచ్చాడని చెప్పారు. డిసెంబర్ 11న బాధితుడి జీనోమ్ సీక్వెన్సింగ్ ఫలితాలు వచ్చాయని వెల్లడించారు. యువకుడు వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నాడని, ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నారని వివరించారు.
Karnataka Omicron news:
మరోవైపు, కర్ణాటకలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం మూడో కేసు నమోదైంది. దక్షిణాఫ్రికా నుంచి తిరిగివచ్చిన 34 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలిందని కర్ణాటక వైద్య శాఖ మంత్రి సుధాకర్ వెల్లడించారు. ప్రస్తుతం బాధితుడిని ఐసోలేషన్‌లో ఉంచినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వివరించారు.
బాధితుడికి దగ్గరగా తిరిగిన వ్యక్తుల సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు అధికారులు. ఐదు ప్రాథమిక, 15 ద్వితీయ కాంటాక్టులను గుర్తించినట్లు మంత్రి సుధాకర్ వెల్లడించారు. వారి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపినట్లు తెలిపారు.