UP election 2022: 'దేశ గతిని నిర్ణయించే ఎన్నికలు'... 'కేంద్రంలో చక్రం తిప్పేదెవరో తేల్చే ఎలక్షన్లు'... అంటూ ఉత్తర్ప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాట్లు సైతం చకచకా సాగుతున్నాయి. రాజకీయ పార్టీలు ఎప్పుడో ప్రచారాన్ని ప్రారంభించేశాయి. ప్రధాని మోదీ ఇప్పటికే అనేక సార్లు యూపీని చుట్టేశారు. మిగిలిన పార్టీలు సైతం.. మేమేం తక్కువేం కాదన్నట్లు భారీ సభలు నిర్వహిస్తున్నాయి.
UP political rallies Omicron
అయితే హుషారుగా సాగుతున్న ఈ ఎన్నికల ప్రచారానికి కరోనా ఆటంకం కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా భారీగా పెరుగుతున్న కొవిడ్ కేసులతో.. రాజకీయ పక్షాలు వెనక్కి తగ్గకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అనేక బహిరంగ సభలను ఆయా పార్టీలు రద్దు చేసుకుంటున్నాయి.
Congress cancels UP election rallies
ఉత్తర్ప్రదేశ్లో వరుస పెట్టి ర్యాలీలు నిర్వహిస్తోంది కాంగ్రెస్ పార్టీ. బాలికలకు ప్రత్యేకంగా పరుగుపందేలను నిర్వహిస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. యూపీలో ఎలాంటి మారథాన్లు నిర్వహించకూడదని బుధవారం నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం ఆజంగఢ్, వారణాసి, గాజియాబాద్, అలీగఢ్లలో ఈ వారం జరగాల్సి ఉన్న నాలుగు పోటీలను సైతం రద్దు చేసింది. బరేలీలో మంగళవారం నిర్వహించిన పోటీల్లో తొక్కిసలాట వంటి పరిస్థితి తలెత్తడం కూడా ఈ మారథాన్ల రద్దుకు కారణమని తెలుస్తోంది.
అప్పటివరకు అంతే...
కరోనా పరిస్థితి మెరుగుపడేంతవరకు పెద్ద పెద్ద ఎన్నికల ర్యాలీలు నిర్వహించకూడదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, యూపీ వ్యవహారాల బాధ్యురాలు ప్రియాంకా గాంధీ ఆదేశించారని ఆ పార్టీ ప్రతినిధి లలన్ కుమార్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో కార్యక్రమాలను పరిమితంగానే నిర్వహించనున్నట్లు తెలిపారు. వీధి ప్రదర్శనలు, ఇంటింటి ప్రచార కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఆ పార్టీ నేత అశోక్ సింగ్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ విధంగా చిన్న చిన్న కార్యక్రమాలతోనే ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు.
UP election 2022 political rallies
యూపీ ప్రదేశ్ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ సీనియర్ నేతలు చర్చించి.. ప్రజా భద్రత దృష్ట్యా బహిరంగ ర్యాలీలు నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక నుంచి సామాజిక మాధ్యమాలు, వర్చువల్ మీడియాలోనే ప్రచారం నిర్వహించడంపై దృష్టి సారించనున్నామని పేర్కొన్నాయి. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపుర్లోనూ ఇదే తరహా విధానాన్ని అనుసరించనున్నామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్ తెలిపారు.
రాజకీయ పార్టీలు చిన్న చిన్న కార్యక్రమాలు నిర్వహించుకునేలా ప్రోత్సహించాలని ఇటీవలే ఎన్నికల సంఘాన్ని కోరింది కాంగ్రెస్. సభలకు హాజరయ్యే ప్రజలకు మాస్కులు పంపిణీ చేసేలా ఆదేశించాలని పేర్కొంది. ఈ మేరకు ఉత్తర్ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అజయ్ కుమార్ లల్లూ, పార్టీ శాసనపక్షనేత ఆరాధనా మిశ్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.