Omicron Cases India: దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటివరకు ఈ వేరియంట్ 11 రాష్ట్రాలకు పాకగా మొత్తంగా 111 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా వైరస్ కట్టడి కోసం అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పింది.
"గతంలో బయటపడిన డెల్టా కంటే ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే 91 దేశాలకు ఈ వేరియంట్ పాకింది. ఐరోపా సహా ఇతర ప్రాంతాల్లో ఈ వేరియంట్ అత్యంత వేగంగా విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న రోజువారీ కరోనా కేసుల్లో 2.4శాతం ఈ వేరియంట్ కేసులే. ఒమిక్రాన్ వ్యాప్తి వేళ ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. అత్యవసరం కాని ప్రయాణాలను కొంతకాలం వాయిదా వేస్తే మంచిది. ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఒకచోట గుమిగూడొద్దు. పండగల వేళ మరింత అప్రమత్తంగా ఉండాలి. కొత్త సంవత్సర వేడుకలను నిరాడంబరంగా జరుపుకోవాలి."
-లవ్ అగర్వాల్, కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి
కొత్త కేసులు..
శుక్రవారం మొత్తం 24 ఒమిక్రాన్ కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్రం తెలిపింది. మహారాష్ట్రలో 8, దిల్లీలో 12 కేసులు వెలుగు చూశాయని చెప్పింది. తెలంగాణ, కేరళలో రెండు చొప్పున కేసులు నమోదయ్యాయని పేర్కొంది.
- మహారాష్ట్ర- 40
- దిల్లీ- 22
- రాజస్థాన్- 17
- కర్ణాటక- 8
- తెలంగాణ- 8
- గుజరాత్- 5
- కేరళ- 7
- ఆంధ్రప్రదేశ్- 1
- చంఢీగఢ్- 1
- తమిళనాడు- 1
- బంగాల్- 1