Omicron cases in India: దేశంలోకి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే ప్రవేశించింది. బెంగళూరులో ఇద్దరికి ఈ వైరస్ నిర్ధరణ అయింది. ఇప్పుడు మరింత ఆందోళన కలిగించే విషయాన్ని వెల్లడించింది బృహత్ బెంగళూరు మహానగర పాలిక(బీబీఎంపీ). ఆఫ్రికా దేశాల నుంచి నగరానికి వచ్చిన సుమారు 10 మంది ప్రయాణికుల ఆచూకీ లేదని వెల్లడించింది. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని బీబీఎంపీ కమిషనర్ గౌరవ్ గుప్త తెలిపారు. 'ట్రాకింగ్ అనేది నిరంతర ప్రక్రియ. దానిని మేం కొనసాగిస్తున్నాం. ఎవరైనా ఫోన్ ద్వారా స్పందించకపోతే.. మాకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. వాటిని అనుసరిస్తాం.' అని పేర్కొన్నారు.
దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 57 మందిలో 10 మంది విదేశీయుల జాడ లభించలేదని తెలిపారు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సుధాకర్.
" దక్షిణాఫ్రికా నుంచి 57 మంది వచ్చారు. అందులో 10 మంది ఆచూకీని బీబీఎంపీ, ఆరోగ్య అధికారులు గుర్తించలేకపోయారు. వారంతా ఆఫ్రికా దేశాల్లో పర్యటించినట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికాకు చెందిన వారు నవంబర్ 12 నుంచి 22 మధ్య బెంగళూరుకు వచ్చారు. ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. రాష్ట్ర ఆరోగ్యశాఖ వారిని గుర్తించేపనిలో నిమగ్నమైంది. త్వరలోనే వారిని పట్టుకుంటాం. వారిని గుర్తించేందుకు పోలీస్ విభాగాన్ని ఆశ్రయించారు అధికారులు. వైరస్ బారిన పడిన వారు నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు."
- డాక్టర్ సుధాకర్, కర్ణాటక ఆరోగ్య మంత్రి.
కర్ణాటకలో కొత్త మార్గదర్శకాలు
ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, ఆరోగ్య మంత్రి సుధాకర్, ఐటీబీటీ మంత్రి అశ్వత్నారాయణ్, రెవెన్యూ మంత్రి అశోక్‌ల సమావేశానంతరం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది కర్ణాటక ప్రభుత్వం.
- కరోనా పరీక్షల్లో నెగెటివ్ వస్తేనే విమానాశ్రయం నుంచి పంపిస్తారు
- విద్యాసంస్థల్లో సాంస్కృతిక కార్యక్రమాలు జనవరి 15 వరకు వాయిదా
- సినిమా హాళ్లు, మాల్స్, పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలి
- అన్ని ప్రభుత్వ శాఖ సిబ్బంది రెండు డోసులు తీసుకోవాలి
- వివాహాల్లో 500 మందికి మించి ఉండకూడదు
- రోజువారీ కరోనా పరీక్షలను 60వేల నుంచి లక్షకు పెంపు
- ఆసుపత్రుల్లో ఆక్సిజన్, ఐసీయూ పడకల ఏర్పాటు
- కొవిడ్ జోనల్ బృందాలు, కంట్రోల్ రూమ్‌ల పునరుద్ధరణ
వారిలో 18 మందికి పాజిటివ్: కేంద్రం
ఎట్ రిస్క్ దేశాల నుంచి భారత్‌లోకి వచ్చిన 16వేల మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించినట్లు పార్లమెంట్లో ప్రకటించారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయా. వారిలో 18 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలిందని, జినోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించినట్లు చెప్పారు. ఎలాంటి సవాళ్లు ఎదురైనా ఎదుర్కొనేందుకు కేంద్రం అన్ని చర్యలు చేపడుతోందని తెలిపారు. బఫర్ స్టాక్ పాలసీతో అన్ని రాష్ట్రాల్లో సరిపడా ఔషధాలను అందుబాటులో ఉంచుతున్నామని వెల్లడించారు. అలాగే, బూస్టర్ డోస్, పిల్లలకు వ్యాక్సిన్‌పై నిపుణుల సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:Omicron Variant: ఒమిక్రాన్‌పై షాకింగ్ విషయాలు- జాగ్రత్త పడకపోతే..!