Older Brother killed his Younger Brother: నేటి సమాజంలో రానురాను కుటుంబ సంబంధాలకు విలువ లేకుండా పోతోంది. తాజాగా కుటుంబ సంబంధాలను ప్రశ్నార్ధకం చేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. సొంత తమ్ముడిపైనే పెట్రోల్ పోసి నిప్పంటించిన ఓ అన్న.. ఇంట్లోంచి అతను బయటికి రాకుండా తలుపు వద్ద బండరాయి పెట్టాడు. ప్రాణాలు రక్షించుకోవాలని ఆయన ఎలాగోలా తప్పించుకుని బయటకు వస్తే.. వీధిలో అందరిముందే రాయితో కొట్టి కొట్టి చంపాడు. గ్రామస్థులంతా చూస్తూ ఉండిపోయారే తప్ప ఎవరూ ఎదురించలేని పరిస్థితి నెలకొంది. సుమారు మూడు గంటల సేపు అన్న ఆ తమ్ముడిని కొడుతూ ఉన్నా.. ఎవరూ వారిని అడ్డుకోకపోగా.. కనీసం పోలీసులకూ సమాచారం అందించలేదు. తన వాటాగా వచ్చిన స్థలాన్ని అమ్ముకోవడానికి తమ్ముడు ప్రయత్నించడం ఇష్టం లేని అన్నే ఇంతటి దారుణానికి తెగబడ్డాడు. ఈ హృదయ విదారక ఘటన వరంగల్ జిల్లాలోని కరీమాబాద్ ఉర్సు ప్రాంతంలో చోటుచేసుకుంది.
పోలీసులు, మృతుడి భార్య తెలిపిన వివరాల ప్రకారం..వరంగల్ జిల్లాలోని 40వ డివిజన్ ఉర్సు తాళ్లమండువ ప్రాంతంలో గోవిందుల శ్రీనివాస్, శ్రీధర్, శ్రీకాంత్ అనే ముగ్గురు అన్నదమ్ములు నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో తమ తల్లిదండ్రులకు చెందిన ఇంటి స్థలాన్ని ముగ్గురు సోదరులు 94.16 గజాల చొప్పున పంచుకున్నారు. పెద్దవాడైన గోవిందుల శ్రీనివాస్ మరణించారు. అయితే చిన్నవాడైన శ్రీకాంత్‌కు వచ్చిన వాటా విషయంలో గొడవపడిన రెండో అన్న శ్రీధర్.. ఆ భూమి తనకు ఇవ్వనని, ఇక్కడే ఉంటే చంపుతానని శ్రీకాంత్‌ను తీవ్రంగా కొట్టి బెదిరించాడు.
ప్రేమ వివాహం.. అనారోగ్య సమస్యలు : దాంతో గొడవ లెందుకులే అని చిన్నవాడైన శ్రీకాంత్ వరంగల్ నుంచి ఇల్లు వదిలి, తన తల్లితో కలిసి నిజామాబాద్‌కు వెళ్లి కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో 2019లో అక్కడి అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు శ్రీకాంత్. ఇదిలా ఉంటే కరోనా తర్వాత ఆయనకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో తనకు చెందిన ఇంటి స్థలాన్ని విక్రయించి ఆ డబ్బుతో వైద్యం చేయించుకోవాలనుకున్నాడు. అదే విషయంపై నిజామాబాద్ నుంచి సొంతూరు ఉర్సుకు వచ్చి తన వాటా స్థలాన్ని విక్రయించడానికి యత్నించగా అన్న శ్రీధర్ ఎప్పటిలాగే బెదిరింపులకు పాల్పడ్డాడు. దాంతో ఈ నెల 7న శ్రీకాంత్ మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్‌లో సోదరుడిపై ఫిర్యాదు చేశాడు.