Old Woman Raped Delhi: దిల్లీలో 87ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచార ఘటనలోని నిందితుడ్ని అరెస్ట్ చేశారు పోలీసులు. అతడి వద్ద నుంచి వృద్ధురాలి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
"నిందితుడు ఓ స్వీపర్. బాధితురాలు ఇంటికి సమీపంలోనే నివసిస్తున్నాడు. అతడిని అరెస్ట్ చేసి వృద్ధురాలి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నాం. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి విచారణ చేపట్టాం. 16 గంటల్లోనే నిందితుడ్ని అరెస్ట్ చేశాం" అని అదనపు డీజీపీ ప్రశాంత్ గౌతమ్ తెలిపారు.
ఇదీ జరిగింది..
పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి ఓ వ్యక్తి వృద్ధురాలు ఉంటున్న ఇంట్లోకి చొరబడ్డాడు. అతడిని చూసి వృద్ధురాలు ఎవరు? అని ప్రశ్నించింది. గ్యాస్ ఏజెన్సీ నుంచి వచ్చానని, ఇంట్లో రిపేర్ ఉందని పిలిచారని దుండగుడు చెప్పుకొచ్చాడు. అయితే, వృద్ధురాలికి అనుమానం వచ్చింది. ఇది గమనించిన ఆ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడి, ఆమె మొబైల్ ఫోన్‌ను లాగేసుకున్నాడు.
ఆ సమయంలో వృద్ధురాలి కుమార్తె(65) ఇంట్లో లేదు. కుమార్తె తిరిగి ఇంటికి వచ్చే సరికి వృద్ధురాలు గాయపడి ఉంది. వెంటనే ఆ మహిళ ఇతర కుటుంబ సభ్యులకు సమాచారం అందించి.. బాధితురాలిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. వృద్ధురాలిపై లైంగిక దాడి జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై ఐపీసీ సహా లైంగిక నేరాలకు సంబంధించిన సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి:వయసు 60+.. 14 మందికి భర్త.. 7 రాష్ట్రాలకు అల్లుడు.. చివరకు..