తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎరువుల ధరలపై కేంద్రం కొత్త మెలిక - ఎరువుల ధరలపై కేంద్రం

ఎరువుల ధరలపై కేంద్రం మాట మార్చింది. పాత ధరలు ఇప్పుడు అందుబాటులో ఉన్న పాతస్టాక్​ విక్రయాల వరకే పరిమితమని పేర్కొంది. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎరువుల లభ్యత, ధరల అంశాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తోందని ఎరువుల రసాయనాల శాఖ ప్రకటనలో వివిరించింది.

Old rates up to old stocks
పాత నిల్వల వరకే పాత రేట్లు

By

Published : Apr 11, 2021, 7:20 AM IST

ఎరువులను పాత ధరలకే విక్రయిస్తాయని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి మన్​సుఖ్​ ఎల్​. మాండవ్య ప్రకటించి 24 గంటలు కూడా కాకముందే ఆ శాఖ మాట మార్చింది. ఆ పాత ధరలు ఇప్పుడు అందుబాటులో ఉన్న పాతస్టాక్​ విక్రయాల వరకే పరిమితమని పేర్కొంది. 'ఇఫ్కో'కు కేంద్ర మంత్రి సదానంద గౌడ ఈ మేరకు సూచించినట్లు తెలిసింది. దేశంలో 2021 ఏడాదిలో ఎరువులకు కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాయంటూ కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

11.26 లక్షల మెట్రిక్​ టన్నులకే..

2021 ఖరీఫ్​ సీజన్​ సన్నద్ధపై కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానంద గౌడ మార్చి 15న వివిధ ఎరువుల సంస్థల సీఎండీలు, ఎండీలతో సమీక్ష నిర్వహించారు. దేశీయంగా ఎరువుల ఉత్పత్తి, విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన ముడిసరుకు, తుది సరుకుల్లాంటి అంశాలపైనా చర్చించారు. దీనికి కొనసాగింపుగా ఏప్రిల్​ 4న ఎరువుల శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఎరువుల పరిశ్రమల ప్రతినిధులు ఇంతవరకు తమ వద్ద ఉన్న నిల్వలు, 2021 ఖరీఫ్​ కోసం చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. ఫాస్ఫాటిక్​, పొటాసిక్​ (పీ అండ్​ కే) ఎరువుల ముడి సరుకుల ధరలు పెరిగినట్లు కూడా ఎరువుల కర్మాగారాల ప్రతినిధులు తెలిపారు. ఇఫ్కో సంస్థ కాంప్లెక్స్​ ఎరువుల ధరలను సవరించిన అంశంపై సదానంద గౌడ తన శాఖ పరిధిలోని సీనియర్​ అధికారులు, ఇఫ్కో ప్రతినిధులతో ఈనెల 8న చర్చించారు. ప్రస్తుతం ఉన్న డీఏపీ, కాంప్లెక్స్​ ఎరువుల నిల్వలను పాత ధరలకే రైతులకు విక్రయించాలని తగిన సూచనలు జారీచేశారు. అందుకు ఇఫ్కో ప్రతినిధులు సానుకూలంగా స్పందిస్తూ తమ వద్ద అందుబాటులో ఉన్న 11.26 లక్షల మెట్రిక్​ టన్నుల డీఏపీ/కాంప్లెక్స్​ ఎరువులను పాత ధరలకే విక్రయిస్తామని చెప్పారు.

9న ఎరువుల శాఖ కార్యదర్శి నేతృత్వంలో మరో సమావేశం జరిగింది. అందులో పీ అండ్​ కే ఎరువుల లభ్యత గురించి ప్రధానంగా సమీక్షించారు. ఖరీఫ్​ సీజన్​, ముమ్మరదశకు చేరక ముందే ఎక్కడికక్కడ తగిన రీతిలో నిల్వ ఉంచాలని కంపెనీలకు సూచించారు. దేశీయ ఎరువుల ఉత్పత్తి దిగుమతుల్లో నిర్దేశిత లక్ష్యాన్ని సాధిస్తామని తయారీదారులు, ఈ సమావేశంలో హామీ ఇచ్చారు. ఇటీవల కాలంలో సౌకర్యవంతంగా ఎరువుల లభ్యత సాగిందని, ఆ పరిస్థితని యథాతథంగా కొనసాగించాలని ఇందులో ఎరువుల శాఖ కార్యదర్శి నిర్దేశించారు. వచ్చే 3 నెలల అవసరాలకు తగ్గట్టు వివిధ రకాల ఎరువులను ఇప్పటికే రాష్ట్రాలకు తరలించినట్లు ఫెర్టిలైజర్​ అసోసియేషన్​ ఆఫ్​ ఇండియా ఒక విశ్లేషణ పత్రాన్ని సమర్పించింది.

"కేంద్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎరువుల లభ్యత, ధరల అంశాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తోంది." అని ఎరువుల రసాయనాల శాఖ ప్రకటనలో వివిరించింది.

ఇదీ చదవండి:ఆ రాష్ట్రాల్లో విజయవంతంగా వారాంతపు లాక్​డౌన్

ABOUT THE AUTHOR

...view details