తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Himachal Pradesh Election : భాజపాకు పింఛను టెన్షన్‌.. హామీలతో దూసుకెళ్తున్న కాంగ్రెస్‌ - భాజాపా పాత పింఛను స్కీమ్​

Himachal Pradesh Election : డబుల్‌ ఇంజిన్‌ అంటూ దూసుకుపోతున్న భారతీయ జనతా పార్టీకి హిమాచల్‌ప్రదేశ్‌లో ఉద్యోగుల పింఛను పథకం ఓ తలనొప్పిగా మారింది. పాత పింఛను పద్ధతే కావాలంటూ ప్రభుత్వ ఉద్యోగులంతా పట్టుబడుతుండటం... అధికారంలోకి వచ్చిన తొలిరోజునే ఆ డిమాండ్‌ తీరుస్తామని కాంగ్రెస్‌ హామీ ఇవ్వటం కమలనాథులకు సవాలుగా నిలుస్తోంది.

himachal pradesh old pension scheme
భాజపాకు పింఛను టెన్షన్‌

By

Published : Nov 10, 2022, 6:26 AM IST

Updated : Nov 10, 2022, 7:27 AM IST

Himachal Pradesh Election : హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో ఉద్యోగుల పింఛను ప్రధానాంశంగా మారింది. రాష్ట్రంలో గణనీయ సంఖ్యలో ఉన్న (సుమారు 3 లక్షల) ప్రభుత్వ ఉద్యోగులు పింఛను విషయంలో ఈసారి పట్టుదలతో ఉన్నారు. 2004 నుంచి అమలులోకి వచ్చిన కొత్త పింఛనుతో తమకు నష్టం జరుగుతోందంటున్న ఉద్యోగులు పాత పింఛను పద్ధతి కోసం పట్టుబడుతున్నారు. ప్రస్తుతం అమలవుతున్న కాంట్రిబ్యూటరీ పింఛను తొలగించాల్సిందేనన్నది ఈ ఎన్నికల వేళ గట్టిగా వినిపిస్తున్న డిమాండ్‌.

హామీలో దూసుకెళ్లిన కాంగ్రెస్‌..భాజపాను దించేసి అధికారంలోకి రావటానికున్న ప్రతి అవకాశాన్నీ వాడుకోవాలనుకుంటున్న కాంగ్రెస్‌ పార్టీ వెంటనే పింఛనుపై స్పందించింది. తాము అధికారంలోకి వస్తే... మొదటిరోజే పాత పింఛను పద్ధతిని ప్రవేశపెడతామంటూ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ప్రతిభాసింగ్‌ ప్రకటించారు. తాము అధికారంలో ఉన్న చత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లతో పాటు ఝార్ఖండ్‌లోనూ ఇప్పటికే దీన్ని అమలు చేస్తున్న విషయాన్ని కూడా ఎత్తి చూపుతున్నారు. హిమాచల్‌లో పాగా వేయటానికి ప్రయత్నిస్తున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా అధికారంలోకి వస్తే తొలి సంతకం పాత పింఛనుపైనే చేస్తామంటోంది. తమ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్‌లో అమలు చేస్తున్న సంగతిని గుర్తు చేస్తోంది.

అడకత్తెరలో భాజపా..ఇలా ఎన్నికల్లో కీలకమైన ఉద్యోగవర్గాన్ని ఆకట్టుకోవటానికి విపక్షాలు దూసుకుపోతుంటే... అధికార భాజపా మాత్రం పాత పింఛను విషయంలో మీనమేషాలు లెక్కపెడుతోంది. కచ్చితమైన హామీ ఇవ్వకుండా దాటవేత ధోరణిని ప్రదర్శిస్తోంది. ఎన్నికలను ఈ అంశం ప్రభావితం చేస్తుందని గమనించిన మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్‌ కుమార్‌ ధుమాల్‌... అధిష్ఠానాన్ని కూడా హెచ్చరించారు. కనీసం నాలుగో తరగతి ఉద్యోగుల వరకైనా పాత పింఛను అమలు చేస్తామనే హామీ ఇవ్వాలని సూచించారు. కానీ... భాజపా మేనిఫెస్టోలో ఆ ఊసే లేదు. ఇందుకు కారణం లేకపోలేదు. హిమాచల్‌ ప్రదేశ్‌లో పాత పింఛను ఇస్తామని ప్రకటిస్తే... దాని ప్రభావం ఆపార్టీపై జాతీయస్థాయిలో పడుతుంది. భాజపా అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాలతో పాటు జాతీయస్థాయిలో కూడా పాత పింఛను పద్ధతి కోసం డిమాండ్లు మొదలవుతాయి. అందుకే భాజపా ఈ అంశంపై మాట్లాడకుండా రాష్ట్ర అభివృద్ధికి డబుల్‌ ఇంజిన్‌ సర్కారు అవసరమంటూ ప్రచారం చేస్తోంది.

హిమాచల్‌ప్రదేశ్‌లాంటి చిన్న రాష్ట్రంలో ఉద్యోగుల ఓట్లు కీలకమవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 3లక్షల మంది ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులు తోడయితే... సుమారు 6 లక్షల ఓట్ల దాకా ఈ వర్గానికుంటాయి. గత ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్‌ల మధ్య గెలుపోటముల తేడా 2.5 లక్షల ఓట్లే! చాలా సీట్లలో 3వేల కంటే తక్కువ ఓట్లతో భాజపా విజయం సాధించింది. ఈ నేపథ్యంలో... ఉద్యోగులు ఒకవేళ పింఛను విషయంలో భాజపాపై వ్యతిరేకత ప్రదర్శిస్తే తమ విజయం సులభమవుతుందన్నది కాంగ్రెస్‌ పార్టీ అంచనా!

ఇదీ చూడండి:'ఎమ్మెల్యేల కోసం బేరాలాడుతున్న వీడియోలు చూశాం.. వాటి గురించి మాట్లాడరేం?'

'ఎమ్మెల్యేల కోసం బేరాలాడుతున్న వీడియోలు చూశాం.. వాటి గురించి మాట్లాడరేం?'

Last Updated : Nov 10, 2022, 7:27 AM IST

ABOUT THE AUTHOR

...view details