తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చారిత్రక ఘట్టాలకు వేదిక.. ఇకపై గతస్మృతులకు నిలయం! - పాత పార్లమెంట్ బిల్డింగ్ చరిత్ర

దాదాపు వందేళ్ల చరిత్ర కలిగిన పార్లమెంటు భవనం ఇక చారిత్రక చిహ్నంగా మారిపోనుంది! కొత్త పార్లమెంటు భవనం ప్రారంభమైన అనంతరం.. ప్రస్తుత భవనం చరిత్ర పుటల్లోకి ఎక్కనుంది. 101 ఏళ్ల క్రితం ఈ భవనానికి శంకుస్థాపన చేయగా.. 95 ఏళ్ల క్రితం ప్రారంభించారు.

old-parliament-building
old-parliament-building

By

Published : Aug 10, 2022, 6:56 AM IST

బ్రిటిష్‌ పాలకులు 1927లో ప్రారంభించిన పార్లమెంటు భవనం ఇక చరిత్ర పుటలకు పరిమితం కానుందా? సోమవారంతో ముగిసిన వర్షాకాల సమావేశాలే ఈ పార్లమెంటుకు చివరి సమావేశాలా? రోజురోజుకు ఈ ప్రశ్నలు ప్రాముఖ్యం సంతరించుకుంటున్నాయి. 101 సంవత్సరాల క్రితం శంకుస్థాపన జరిగిన ప్రస్తుత పార్లమెంటు భవనం ఆరు ఎకరాల్లో విస్తరించింది. మొదటి అంతస్తులో 144 స్తంభాలతో ఠీవిగా దర్శనమిస్తుంది. దీని పక్కనే 2020 డిసెంబరులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన కొత్త పార్లమెంటు భవన నిర్మాణం ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీకల్లా పూర్తవుతుందని ఆశించారు. అయితే శీతాకాల సమావేశాలకు గానీ కొత్త భవనం సిద్ధమయ్యేలా లేదు. అందులో సమావేశాలు ప్రారంభమైన రోజు బ్రిటిషర్లు నిర్మించిన పాత పార్లమెంటు భవనం చరిత్ర చిహ్నంలా మిగులుతుంది.

1920ల్లో బ్రిటిషర్లు రాజధానిని కలకత్తా నుంచి దిల్లీకి మార్చిన తరువాత 1921 ఫిబవరి 12న బ్రిటిష్‌ డ్యూక్‌ ఆఫ్‌ కనాట్‌ పార్లమెంటు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అప్పట్లో దాన్ని కౌన్సిల్‌ హౌస్‌గా పరిగణించారు. ఆ తరువాత 26 ఏళ్లకే దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. కౌన్సిల్‌ హౌస్‌ పక్కనే నిర్మితమైన వైస్రాయ్‌ హౌస్‌ స్వాతంత్య్రం వచ్చాక రాష్ట్రపతి భవన్‌గా మారింది. పార్లమెంటు భవనానికి శంకుస్థాపన జరిగి గత సంవత్సరం ఫిబ్రవరికి నూరేళ్లు పూర్తయ్యాయి. ఆ సమయంలో పార్లమెంటులో బడ్జెట్‌ సమావేశాలు జరుగుతుండగా, దాని పక్కనే కొత్త పార్లమెంటు భవన నిర్మాణ పనులు సాగుతూ ఉన్నాయి.

పాత పార్లమెంటు భవనం 560 అడుగుల వ్యాసంతో నిర్మితమైంది. ఈ భవన ఆకృతిని సర్‌ హెర్బర్ట్‌ బేకర్‌ అందించారు. ఆయనతో కలసి సర్‌ ఎడ్విన్‌ లుట్యెన్స్‌ దిల్లీ రైసీనా హిల్స్‌ ప్రాంతంలో బ్రిటిష్‌ సామ్రాజ్యానికి కొత్త రాజధానిని నిర్మించే బాధ్యతను చేపట్టారు. పార్లమెంటు భవనానికి శంకుస్థాపన చేసిన డ్యూక్‌ ఆఫ్‌ కనాట్‌ పేరు ప్రిన్స్‌ ఆర్థర్‌. ఆయన అప్పటి బ్రిటిష్‌ సామ్రాజ్యాధీశుడు కింగ్‌ జార్జ్‌కు దగ్గరి బంధువు. ఏథెన్స్‌, రోమ్‌ తదితర రాజధాని నగరాల వైభవం, ముఖ్యంగా అశోక చక్రవర్తి, మొఘలుల వారసత్వం ఈ భవనంలో ప్రతిబింబించాలని ఆర్థర్‌ ఆశించారు.

ఈ వలయాకార భవనంలోకే 1929లో భగత్‌ సింగ్‌ బాంబు విసిరారు. స్వాతంత్య్రం వచ్చిన సందర్భంగా ఈ భవనంలోని సెంట్రల్‌ హాలులో జవహర్‌లాల్‌ నెహ్రూ 'బంగరు భవితతో సమాగమం' అనే సుప్రసిద్ధ ప్రసంగం చేశారు. ఇక్కడే భారత రాజ్యాంగం రూపుదిద్దుకుంది. గడిచిన ఏడున్నర దశాబ్దాలలో కీలక సమస్యలపై చర్చోపచర్చలు, పలు వివాదాలు, రభసలను పార్లమెంటు చవిచూసింది. ఇక్కడే ఎన్నో చరిత్రాత్మక చట్టాలు ఆమోదం పొందాయి.

ABOUT THE AUTHOR

...view details