తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Old Parliament Building History : బ్రిటిష్​ టు భారత్​.. చారిత్రక ఘట్టాలకు సజీవ సాక్ష్యం.. పాత పార్లమెంట్​లో​ విశేషాలెన్నో! - పాత పార్లమెంట్​ న్యూస్

Old Parliament Building History : అనేక చారిత్రక ఘట్టాలకు.. నవ భారత నిర్మాణానికి.. చరిత్రలో నిలిచిపోయే మహామహుల ప్రసంగాలకు.. స్వాతంత్ర్య భారత ప్రస్థానంలో ప్రతీ మలుపునకు ప్రత్యక్ష సాక్ష్యంలా నిలిచింది పార్లమెంట్‌ పాత భవనం. స్వాతంత్ర్యానికి పూర్వం బాంబులు విసిరి భగత్‌సింగ్‌ చేసిన విప్లవ నినాదాలకు.. స్వాతంత్ర్యం తర్వాత నెహ్రూ ఆనంద బాష్పాలకు.. సాక్షిభూతంలా నిలిచింది ఈ భవనం. స్వయం పాలనలో... ఆధునిక భారత నిర్మాణానికి చేసిన ప్రతీ శాసనానికి... చరిత్రగతిని మార్చిన దిగ్గజ నేతల ప్రసంగాలకు వేదికగా నిలిచిందీ పార్లమెంట్‌ పాత భవనం. వలస పాలన, రెండో ప్రపంచ యుద్ధం, రాజ్యాంగ ఆమోదం సహా ఎన్నో చారిత్రక నిర్ణయాలు తీసుకుంది కూడా ఈ భవనంలోనే.

Old Parliament Building History
Old Parliament Building History

By ETV Bharat Telugu Team

Published : Sep 18, 2023, 6:04 PM IST

Old Parliament Building History :స్వతంత్ర భారతంలోని కీలక ఘట్టాలకు, ఎమర్జెన్సీ లాంటి చీకటి ఘట్టాలకు, ఆధునిక భారత ప్రస్థానానికి దారితీసిన సంస్కరణలకు నిదర్శనంలా నిలిచింది పార్లమెంట్‌ పాత భవనం. నవ భారత నిర్మాణంలోని ప్రతీ మలుపునకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిన ఈ ప్రజాస్వామ్య సౌధం... 96 ఏళ్ల భారత ప్రయాణ కాలానికి ప్రతీకగా నిలిచింది. 1911లో కోల్‌కతా నుంచి రాజధానిని దిల్లీకి తరలించాలని నిర్ణయించిన బ్రిటిష్‌ ప్రభుత్వం... దీని కోసం కొత్త దిల్లీని ప్రత్యేకంగా నిర్మించింది. 1913లోనే కొత్త దిల్లీ ప్రణాళికలు సిద్ధమవ్వగా.. ఆ సమయానికి పార్లమెంటులాంటి ఆలోచనే... ఆంగ్లేయులకు లేదు. ప్రస్తుత రాష్ట్రపతి భవనంలోనే లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ సమావేశ మందిరం ఏర్పాటు చేస్తే... సరిపోతుందని బ్రిటీషర్లు అనుకున్నారు. కానీ 1918 మాంటెగు చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణలతో చట్టసభల ప్రాధాన్యంతో పాటు ఎగువ, దిగువ సభలు అమల్లోకి వచ్చాయి. వీటి నిర్వహణతో పాటు సభ్యులు, పరిపాలన సిబ్బంది పెరిగారు.

దీంతో బ్రిటిష్‌ ప్రభుత్వం రెండు ప్రతిపాదనలతో ముందుకొచ్చింది. ఒకటి టెంట్‌లో సభను నిర్వహించటం. రెండోది భవంతిని నిర్మించటం. షామియానా కింద నిర్వహిస్తే పరువు పోతుందనే ఉద్దేశంతో రెండో ప్రతిపాదనకే మొగ్గు చూపి... 1921లో సెక్రటేరియెట్‌ బిల్డింగ్‌లోనే ఓ భారీ ఛాంబర్‌ కట్టారు. అదే సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ తొలి భవంతి. ఇంతలో కొత్తదిల్లీ రూపశిల్పులైన బ్రిటిష్‌ ఆర్కిటెక్టులు ఎడ్విన్‌ ల్యూటెన్‌, హెర్బర్ట్‌ బేకర్‌లు ఎగువ, దిగువ చట్టసభలకు శాశ్వత భవన నిర్మాణాలు ప్రతిపాదించారు. ల్యూటన్‌ వృత్తాకారంలో, బేకర్‌ త్రికోణాకారంలో ప్రణాళికలు తయారు చేశారు. చివరకు ల్యూటన్‌ దానికే బ్రిటిష్‌ సర్కారు మొగ్గు చూపింది. 1921 ఫిబ్రవరి 12న డ్యూక్‌ ఆఫ్‌ కానాట్‌ ప్రిన్స్‌ ఆర్థర్‌... కొత్త పార్లమెంటు భవనానికి శంకుస్థాపన చేశారు. ఆరేళ్లలో తయారైన ఈ భవనాన్ని 1927 జనవరి 19న... అప్పటి భారత వైస్రాయ్‌ లార్డ్‌ ఇర్విన్‌ ప్రారంభించారు. ఆరు ఎకరాల విస్తీర్ణంలో 144 పిల్లర్లతో తయారైన ఈ అందమైన భవంతి మధ్యలో సెంట్రల్‌ హాల్‌, దాని పక్కనే మూడు అర్ధవృత్తాకార ఛాంబర్లు... చుట్టూ ఉద్యానవనంతో ఆకట్టుకునేలా నిర్మించారు. ఈ పార్లమెంటు భవనం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది.

Old Parliament Building Legacy : పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌ చుట్టూ ఉండే ఒక ఛాంబర్‌లో... సంస్థానాధీశుల సభ, మరోదాంట్లో స్టేట్‌ కౌన్సిల్‌, మూడోదాంట్లో సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ ఉండేవి. ఈ లెజిస్లేటివ్‌ అసెంబ్లీలోనే 1929లో విప్లవకారుడు భగత్‌సింగ్‌, బతుకేశ్వర్‌ దత్‌లు.. బాంబు విసిరి సంచలనం సృష్టించారు. స్వాతంత్య్రానంతరం బ్రిటిష్‌ నుంచి అధికార మార్పిడి ఈ పార్లమెంటు భవనంలోనే జరిగింది. మొదట్లో సుప్రీంకోర్టు కూడా ఛాంబర్‌ ఆఫ్‌ ప్రిన్సెస్‌ నుంచే కార్యకలాపాలు నిర్వహించింది. యూపీఎస్సీ కార్యాలయం కూడా పార్లమెంటులోనే ఉండేది. స్థలాభావాన్ని అధిగమించటం కోసం 1956లో పాత పార్లమెంటులో మరో రెండు అంతస్థులు నిర్మించారు. అయినా స్థలం సరిపోక అవస్థలు పడేవారు. 2001లో పాకిస్థాన్‌ దన్నుతో లష్కరే తోయిబా తీవ్రవాదుల దాడినీ ఈ ప్రజాస్వామ సౌథం ఎదుర్కొంది.

జవహర్‌లాల్‌ నెహ్రూ నుంచి ప్రధాని మోదీ వరకు ఎందరో నేతల కీలక ప్రసంగాలకు ఈ పాత పార్లమెంట్‌ భవనం వేదికగా నిలిచింది. మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ విధితో ప్రయత్నించండి అంటూ చేసిన ప్రసంగం.. ఆ భవనాల్లో మార్మోగుతూనే ఉంటుంది. డిసెంబర్ 9, 1946న సెంట్రల్ ఛాంబర్‌లో రాజ్యాంగ సభ మొదటి సమావేశాన్ని నిర్వహించగా.. ఇదే భవనంలో నవంబర్ 26, 1949న రాజ్యాంగాన్ని పార్లమెంట్‌ ఆమోదించారు. భారత రిపబ్లిక్ ఆవిర్భావాన్ని సూచిస్తూ జనవరి 26, 1950న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.

History of Parliament House of India : 75 ఏళ్ల భారత పార్లమెంటు చరిత్ర.. తగ్గుతున్న యువతరం.. పెరిగిన మహిళా బలం..

Parliament Special Session History : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. చరిత్ర ఏం చెబుతోంది?.. అదే అజెండానా!

ABOUT THE AUTHOR

...view details