Old Man United With Family : కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఓ వృద్ధుడు.. పదేళ్ల తర్వాత తన కుటుంబ సభ్యుల చెంతకు చేరుకున్నాడు. భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటకొచ్చి.. పదేళ్ల పాటు భిక్షాటన చేస్తూనే జీవనం సాగించాడు. అసలు అతడు ఎవరు? ఏం జరిగింది?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జిల్లాలోని ఎంహెచ్ పట్నం గ్రామపంచాయతీ పరిధిలోని మాదాపుర్ గ్రామానికి చెందిన గురు సిద్ధప్పకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. పదేళ్ల క్రితం తన భార్యతో గొడవ జరిగింది. ఆ కోపంతో ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత తుమకూరు, గుబ్బి, దేవరాయనదుర్గం, మధుగిరి, పావగడ, కొరటగెరె, సిద్దరబెట్ట తదితర ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ జీవనం సాగించాడు. కొన్నిరోజుల క్రితం అతడు కొరటగెరె తాలూకాలోని మారేనాయకనహళ్లి గ్రామానికి చేరుకున్నాడు.
ఎక్కడికెళ్లినా బ్యాగుతోనే.. స్థానికులకు అనుమానం..
గ్రామంలోని బస్‌స్టాప్ దగ్గర, రోడ్డు పక్కన చెట్టు కింద మురికి, చిరిగిన బట్టలతో గురు సిద్ధప్ప భిక్షాటన చేస్తూ ఉండేవాడు. అయితే ఎక్కడికెళ్లినా తన దగ్గర ఉన్న పాత బ్యాగును మాత్రం కచ్చితంగా తీసుకెళ్లేవాడు. ఇది చూసిన స్థానికులకు వృద్ధుడిపై అనుమానం వచ్చింది. ఆ బ్యాగులో గంజాయి ఉండొచ్చని అనుమానించి 112కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి గుబ్బి స్టేషన్ ఏఎస్సై హనుమంతరాయప్ప, హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణయ్య చేరుకున్నారు.