Old Couples Died Together In Bihar : 75 ఏళ్లుగా కలిసి ఉన్న ఆ వృద్ధ దంపతులను మరణం సైతం విడదీయలేకపోయింది. భార్య అనారోగ్యంతో ఉండటాన్ని చూసి తట్టుకోలేక భర్త చనిపోగా.. ఆయన మరణించిన కొన్ని గంటలకే ఆ వృద్ధురాలు సైతం తనువు చాలించింది. బిహార్‌లోని వైశాలి జిల్లాలో ఈ ఘటన జరిగింది.
బిదుర్పుర్ ప్రాంతంలోని పానాపుర్ కల్యామ్ గ్రామానికి చెందిన గిరిజా దేవి(85), రామ్ లఖన్ పాసవాన్(90)లకు 75 ఏళ్ల క్రితం వివాహమైంది. అప్పటి నుంచి వీరిద్దరూ అన్యోన్యంగా కలిసి ఉంటున్నారు. గిరిజా దేవి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. హాజీపుర్లోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోమ్‌లో చికిత్స పొందుతోంది. భార్య ఆస్పత్రిలో అలా ఉండటాన్ని రామ్ లఖన్ చూడలేకపోయారు. భార్య అనారోగ్యం పట్ల తీవ్ర ఆవేదనకు గురయ్యారు. గిరిజ బాగోగుల గురించి అడిగిన వారందరికీ తామిద్దరం ఒకేసారి మరణిస్తే బాగుండేదంటూ సమాధానం ఇచ్చారు రామ్ లఖన్.
కాగా, బుధవారం సాయంత్రం నడక కోసం బయటకు వెళ్లిన ఆయన తిరిగి వచ్చే సమయంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయనకు అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామస్థులంతా సిద్ధమయ్యారు. గురువారం ఉదయం అత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, తెల్లవారక ముందే గిరిజా దేవి సైతం మరణించడం చూసి అంతా షాక్‌కు గురయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే ఆమె ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆమె మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చారు. భార్యాభర్తలు ఇద్దరికీ ఒకేసారి అంత్యక్రియలు నిర్వహించారు. "ఇద్దరం కలిసి చనిపోతే బాగుండేదని రామ్ లఖన్ అంటుండేవారు. అలా జరిగితే చరిత్రలో నిలిచిపోతాం అని అనేవారు" అని గ్రామస్థులు తెలిపారు.