Old Couple Marriage: సాధారణంగా ప్రేమకు, స్నేహానికి వయసుతో సంబంధం లేదంటుంటారు! కానీ, పెళ్లికి వయసుతో సంబంధం లేదు.. ఒకరినొకరు అర్థం చేసుకునే మనసులు ఉంటే చాలని చాటిచెప్పింది ఓ వృద్ధ జంట. కర్ణాటక మైసూరు జిల్లాకు చెందిన 85 ఏళ్ల వృద్ధుడు.. 65 ఏళ్ల వృద్ధురాలిని వివాహమాడాడు.
మైసూరులోని గౌసియా నగరకు చెందిన ముస్తఫా భార్య కొన్నేళ్ల క్రితం చనిపోయింది. అతనికి తొమ్మిది మంది పిల్లలు. అందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. వారి నచ్చిన పనులు చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. దీంతో ఆయన ఒంటరిగా మిగిలిపోయాడు. ఆర్థికంగా, ఆరోగ్యంగా బాగానే ఉన్న ముస్తఫా.. మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తోడు కోసం వెతకగా.. అదే నగరంలో ఉన్న ఫాతిమా అనే మహిళ గురించి తెలిసింది. ఆమెకు భర్త లేడు. పిల్లలు ఉన్నా.. వివాహాల తర్వాత వేరే ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఫాతిమా కూడా ఒంటరిగానే ఉంది.
ఇదంతా తెలుసుకున్న ముస్తఫా.. ఫాతిమాను పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదించాడు. ఆమె అందుకు అంగీకరించింది. ముస్లిం సంప్రదాయం ప్రకారం.. కుటుంబసభ్యుల సమక్షంలో వారు వివాహం చేసుకున్నారు. దీంతో పరిసర ప్రాంతాల్లో వారి వివాహమే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.