ఏటీఎంలలో కొత్త రకం చోరీలు పెరుగుతున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని బ్యాంకులకు ఆదేశాలిచ్చినట్లు అధికారులు తెలిపారు. 'ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్' ద్వారా భద్రతను మెరుగుపరచాలని కోరారు. ఇటీవలి కాలంలో 'మ్యాన్ ఇన్ ద మిడిల్' (ఎంఐటీఎం) దాడులు పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం బ్యాంకులను హెచ్చరించింది. ఇందులో భాగంగా సైబర్ నేరగాళ్లు.. 'ఏటీఎం స్విచ్' నుంచి 'ఏటీఎం హోస్ట్'కు వెళ్లే సందేశాలను మార్చివేస్తున్నారని, తద్వారా అక్రమంగా నగదును విత్‌డ్రా చేస్తున్నారని తెలిపింది.
"తొలుత సైబర్ నేరగాళ్లు.. ఏటీఎం యంత్రం, రౌటర్‌కు మధ్య ఒక పరికరాన్ని పెడతారు. నెట్‌వర్క్ ద్వారా ఏటీఎంకు సంధానమై ఉండే ఆథరైజేషన్ హోస్ట్ (ఏటీఎం స్విచ్) నుంచి వచ్చే సందేశాన్ని మార్చే సామర్థ్యం ఈ పరికరానికి ఉంటుంది. ఆ తర్వాత నేరగాళ్లు చెల్లుబాటు కాని కార్డులను ఉపయోగించి, విత్‌డ్రాల్ రిక్వెస్ట్‌ను పంపుతారు. దీనికి స్పందనగా ఏటీఎం స్విచ్.. ‘నిరాకరణ’ (డిక్లైన్డ్) సందేశాన్ని పంపుతుంది. మార్గమధ్యలో నేరగాడు ఆ సందేశాన్ని అడ్డగించి, దాన్ని మారుస్తాడు. లావాదేవీని ఆమోదిస్తున్నట్లుగా నకిలీ సందేశాన్ని సృష్టిస్తాడు. దీని సాయంతో నగదు విత్‌డ్రా చేసుకుంటాడు" అని అధికారులు తెలిపారు.