Officer Punished Complaint In Uttar Pradesh : తన వద్దకు సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన కొందరు అమాయక వ్యక్తులపై ఓ సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్- ఎస్డీఎమ్ అనుచితంగా ప్రవర్తించాడు. ఓ బాధితుడిని మోకాళ్లపై కోర్చోమని శిక్ష విధించాడు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లగా.. అతడిని విధుల నుంచి తొలగించారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్గంజ్ మండలంలోని మందన్పుర్ గ్రామస్థుల మధ్య ఓ శ్మశాన వాటికి స్థలం విషయంలో వివాదం తలెత్తింది. దీనిపై ఓ వర్గం ఫిర్యాదు చేయడానికి మీర్గంజ్ పట్టణంలోని సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్- ఎస్డీఎమ్ ఉదిత్ పవార్‌కు వద్దకు వెళ్లారు. తమ గ్రామంలో ఉన్న శ్మశాన వాటికను వేరొక వర్గం వారు ఆక్రమించుకున్నారని.. అందుకుగాను వేరొక చోట స్థలం ఏర్పాటు చేసి తమకు న్యాయం చేయాలని తమ సమస్యను విన్నవించుకున్నారు. ఆ అధికారికి తమ అభ్యర్థన పత్రాన్ని అందించారు.
అయితే, ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారిపట్ల ఉదిత్ పవార్ దురుసుగా ప్రవర్తించాడు. గ్రామస్థుల్లో ఒకరిని మోకాళ్లపై వంగి కూర్చోవాలంటూ అకారణంగా శిక్షించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఈ విషయం జిల్లా మేజిస్ట్రేట్ శివకాంత్ ద్వివేది దృష్టికి వెళ్లింది. దీంతో ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి విచారణ చేపట్టారు. అమాయకుల పట్ల కఠినంగా వ్యవహించినందుకు ఎస్‌డీఎమ్‌ను విధుల నుంచి తొలగించారు.