కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసి వైరస్ను కట్టడి చేసేందుకు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు. అలాగే.. సార్స్ కోవ్2 వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మాస్కులు, భౌతిక దూరం, శానిటైజేషన్, వెంటిలేషన్ చాలా ముఖ్యమని తెలిపారు. సరైన వెంటిలేషన్ ఉన్న ప్రాంతం వైరస్ వ్యాప్తిని తగ్గించటంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. వైరస్ బారిన పడిన వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సోకే ప్రమాదాన్ని తగ్గిస్తుందన్నారు.
వైరస్ వ్యాప్తికి తుంపర్లు(ఏరోసోల్), సూక్ష్మబిందులువులు(డ్రాప్లేట్స్) ప్రధాన వాహకాలుగా ఉన్నట్లు పేర్కొన్నారు. గాలిలో తుంపర్లు సుమారు 10 మీటర్ల వరకు, వైరస్ సోకిన వ్యక్తి నుంచి 2 మీటర్ల వరకు సూక్ష్మ బిందువులు వ్యాపిస్తాయన్నారు. లక్షణాలు లేని వ్యక్తి సైతం వైరస్ వ్యాప్తికి సరిపడా సూక్ష్మ బిందువులను విడుదల చేస్తారని, దాని ద్వారా చాలా మందికి వైరస్ సోకే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.