టై అండ్ డై చీరలకు పెట్టింది పేరు ఒడిశా. ఈ చేనేత విధానానికే మరో పేరు 'బంధకళ'. ఈ కళలో సువర్ణపూర్ చేనేత కళాకారులు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ప్రాంతంలోనే బంధకళ పుట్టినట్లు చెప్తారు. ఈ ఊరంతా రంగురంగుల దారాలతో తయారుచేసే కళ్లు చెదిరే డిజైన్లే దర్శనమిస్తాయి.
సువర్ణపూర్‌కు చెందిన ఓ చేనేత కళాకారుడు ఓ చీరపై భారతదేశ పటం చిత్రించాడు. చీర కొంగు, అంచులపై 28 రాష్ట్రాల పేర్లు, వాటి చిత్రపటాలు డిజైన్ చేశాడు. అంతేకాదు, అన్నదాతల ఔన్నత్యాన్ని చాటిచెప్పే 'జై జవాన్-జై కిసాన్ ' నినాదం, దేశభక్తిని తెలిపే 'ఐ లవ్ మై ఇండియా' లాంటి నినాదాలను సన్నని దారాలతో చీరపై నేశాడు. ఈ డిజైన్లన్నీ టై అండ్ డై పద్ధతిలోనే చేశాడు చేనేత కళాకారుడు ఈశ్వర్ మెహెర్. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్... ఈ అద్భుతమైన కశాఖండాన్ని చూసి, ఈశ్వర్‌ను మెచ్చుకున్నారు.
"భరతమాత చిత్రపటం ఈ చీరపై అద్దాం. దేశంలోని 28 రాష్ట్రాల పేర్లు కనిపిస్తాయి. జై జవాన్- జై కిసాన్ నినాదంతో సందేశాన్ని కూడా ఈ చీర ద్వారా ఇవ్వదలచుకున్నాం. ఐ లవ్ మై ఇండియా అనే నినాదం కూడా రాశాం. ఈ చీరను నేసేందుకు నాకు నెల సమయం పట్టింది."
-ఈశ్వర్ మెహెరా, టై అండ్ డై కళాకారుడు
"శంబల్‌పూరీ చీరలకు ఒడిశావ్యాప్తంగా మంచి గిరాకీ ఉంది. ఈ చీరలు నేసేందుకు మహిళలూ ఆసక్తి చూపుతారు. చీరలపై సుందరమైన డిజైన్లు అద్దుతారు. సోనేపూర్‌లో, ఒడిశాలోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా శంబల్‌పూర్ చీరలకు మంచి ఆదరణ దక్కుతోంది. చీరతో చాలా సౌకర్యంగా ఉంటుంది. అందుకే మహిళలు ఇష్టంగా కట్టుకుంటారు."