గతేడాది కరోనా లాక్డౌన్ చాలామందికి ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయినా.. కొందరికి మాత్రం మంచే చేసింది! చాలా మంది ఉపాధి కోల్పోయి, బతకడానికి నానా తంటాలు పడితే.. అదే సమయంలో మరికొందరు తమ ప్రతిభకు పదునుపెట్టారు. డబ్బు సంపాదించే దిశగా ప్రయత్నాలు చేశారు. ఆ కోవకు చెందినవాడే ఒడిశాకు చెందిన గిరిజన యువకుడు ఇసాక్ ముండా. లాక్డౌన్లో 'ఇసాక్ ముండా ఈటింగ్' అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించిన ఈ రోజువారీ కూలీ.. ఇప్పుడు లక్షల ఆదాయం ఆర్జిస్తున్నాడు. తన వీడియోలతో అందరి మనసులు దోచుకుంటున్నాడు.
కాలక్షేపం కోసం చూస్తూ..
ఇసాక్ ముండా.. ఒడిశా సంబల్పుర్ జిల్లాలోని మారుమూల బాబుపాళీ గిరిజన గ్రామానికి చెందిన వ్యక్తి. ఇసాక్.. రోజువారీ కూలీపని చేసుకుని జీవితం సాగించేవాడు. అయితే కరోనా లాక్డౌన్ వల్ల ఇంటికే పరిమితమయ్యాడు. సొంత ఫోన్ లేకపోయినా.. కాలక్షేపం కోసం తన స్నేహితుల చరవాణుల్లో యూట్యూబ్ వీడియోలు చూడటం మొదలుపెట్టాడు. ఆ సమయంలోనే తాను కూడా వీడియోలు చేసి యూట్యూబ్‌లో పెట్టాలన్న ఆలోచన వచ్చింది.
రూ.3వేలు అప్పుచేసి..
వీడియోలు చేసేందుకు కావాల్సిన పరికరాలను కొనేందుకు ఇసాక్ రూ. 3వేలు అప్పు చేశాడు. అతను అప్లోడ్ చేసిన తొలి వీడియో చాలా సింపుల్‌గా ఉంటుంది. ప్లేటు నిండా అన్నం పెట్టుకుని, చాలీచాలని కూరతో తిన్న వీడియోను ఓ కిప్యాడ్ మొబైల్‌తో రికార్డు చేసి.. 2020 మార్చి 26న యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాడు. అంతే.. అప్లోడ్ చేసిన కొన్ని గంటల్లోనే వేలాది వ్యూస్, కామెంట్స్ వచ్చాయి. ఆ తర్వాత తన యూట్యూబ్ ఛానెల్‌కి వ్యూవర్స్ పెరిగారు.