Odisha Train Tragedy Mortuary : ఒడిశా రైలు దుర్ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలను ప్రమాద ప్రాంతమైన బహనాగా బజార్ హైస్కూల్లో ఉంచారు. తాత్కాలిక మార్చురీగా స్కూల్ భవనాన్ని మార్చి అక్కడే రైలు ప్రమాదంలో మరణించినవారి మృతదేహాలను భద్రపరిచారు. దీంతో అక్కడికి వెళ్లాలంటే ఉపాధ్యాయులు, పిల్లలు, వారి తల్లిదండ్రులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల భవనం కూడా పాతబడిన కారణంగా కూల్చివేసి.. కొత్త భవనం కట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లింది. దీనిపై స్పందించిన ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి ఎస్ అశ్వతి.. త్వరలోనే ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 'చాలా మంది విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నట్లు గుర్తించాము. కాబట్టి ముందుగా విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇస్తాం. మానసిక కౌన్సెలింగ్ కోసం డిపార్ట్‌మెంట్ నుంచి ఒక బృందాన్ని పంపుతాం' అశ్వతి వెల్లడించారు.
ఇప్పటికే స్థానిక అధికారులు, జిల్లా మేజిస్ట్రేట్‌తో కూడిన రెండు కమిటీలు.. బహనాగా పాఠశాలను వరుసగా రెండు రోజులు సందర్శించాయి. అందులో భాగంగా బాలేశ్వర్ జిల్లా కలెక్టర్ దత్తాత్రేయ బావుసాహెబ్ శిందే గురువారం బహనగా పాఠశాలను సందర్శించారు. పాఠశాల నిర్వాహణ కమిటీ, సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'పాఠశాల భవనం ఆస్బెస్టాస్ పైకప్పుతో నిర్మించింది. ఇప్పటికే చాలా పాతది కావడం వల్ల మార్చురీగా ఉపయోగించారు. దీని వల్ల ప్రజల్లో కొంత భయాందోళనలు ఉన్నందున కూల్చివేయాలని స్థానికులు అడుగుతున్నారు. ప్రజలు భయపడుతున్నట్లు పాఠశాలలో దెయ్యాలు ఏమి లేవు.' అని కలెక్టర్ చెప్పారు.