Odisha train accident : ఒడిశాలో రైళ్ల ప్రమాదం తర్వాత వేలాది మంది ప్రయాణికులు తమ టికెట్లు రద్దు చేసుకున్నారన్న కాంగ్రెస్ పార్టీ ఆరోపణలను భారతీయ రైల్వే కేటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ఖండించింది. ఆ పార్టీ ఆరోపణలు వాస్తవం కాదని పేర్కొంది. కాంగ్రెస్ ఆరోపణలకు భిన్నంగా.. టికెట్లు రద్దు కావడం తగ్గిందని తెలిపింది. జూన్ ఒకటిన 7.7 లక్షల టికెట్లు రద్దైతే.. జూన్ మూడు నాటికి ఈ సంఖ్య 7.5 లక్షలకే పరిమితమైందని ఐఆర్సీటీసీ పేర్కొంది.
రైల్వే టికెట్లు భారీగా రద్దయ్యాయంటూ కాంగ్రెస్ నేత, భక్త చరణ్ దాస్ సోమవారం ఓ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆరోపణలు చేశారు. ప్రయాణంలో భద్రత ఉండదన్న కారణంతో చాలా మంది టికెట్లు రద్దు చేసుకున్నారని తెలిపారు. 'అలాంటి రైలు ప్రమాదం గతంలో ఎన్నడూ జరగలేదు. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన అందరినీ కలచివేసింది. ప్రమాదం తర్వాత వేలాది మంది టికెట్లు రద్దు చేసుకున్నారు. రైలులో ప్రయాణం చేయడం సురక్షితం కాదని వారంతా అనుకుంటున్నారు' అని భక్త చరణ్ దాస్ వివరించారు.
ఇదీ చదవండి:'రైల్వేలో భద్రతపై ప్రజల్లో ఆందోళన.. మోదీజీ నిర్లక్ష్యం ఎందుకు?'.. ఖర్గే ప్రశ్నల వర్షం
సీబీఐ ఎఫ్ఐఆర్
Odisha train accident CBI investigation : మరోవైపు, ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సీబీఐ కేసు నమోదు చేసింది. మంగళవారం ఉదయం ఘటనాస్థలాన్ని పరిశీలించిన సీబీఐ ప్రత్యేక బృందం.. రైలు ప్రమాదానికి సంబంధించి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది. నిబంధనల ప్రకారం బాలేశ్వర్ రైల్వే పోలీసులు జూన్ 3న నమోదు చేసిన కేసును సీబీఐ తన పరిధిలోకి తీసుకుంది. అనంతరం సొంతంగా కొత్త ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ప్రమాద ఘటన జరిగిన బాలేశ్వర్కు చేరుకున్నట్లు సీబీఐ అధికారిక ప్రకటన వెలువరించింది. తదుపరి విచారణ కొనసాగుతోందని సీబీఐ స్పష్టం చేసింది. రైలు ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందా? లేక నిర్లక్ష్యం వల్ల జరిగిందా? లేక సాంకేతిక లోపం వల్ల జరిగిందా? అన్న అంశాలపై సీబీఐ దర్యాప్తు చేయనుంది. 'సీబీఐకి రైల్వే వ్యవస్థ పనితీరుపై అంతగా అవగాహన లేదు. వారికి అధికారులు, ఫోరెన్సిక్ నిపుణుల నుంచి సహకారం అవసరం' అని సంబంధిత వర్గాలు తెలిపాయి.
కాంగ్రెస్ విమర్శలు
అయితే, రైలు ప్రమాదంపై సీబీఐ విచారణకు ఆదేశించడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. సొంత తప్పుల నుంచి ప్రజల దృష్టి మరలించడం సహా మీడియాలో హెడ్లైన్స్ కోసమే సీబీఐకి కేసు అప్పగించిందని ఆరోపించింది. ఘటన జరిగి 96 గంటలు అయినా.. కేంద్ర ప్రభుత్వం జవాబుదారీగా ఉండటం లేదని కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియా శ్రీనేత్ వ్యాఖ్యానించారు. రైల్వే శాఖ మంత్రి రాజీనామా చేయకపోగా.. ప్రజల దృష్టి మరల్చేందుకు కొత్త థియరీలను ప్రచారంలోకి తెస్తున్నారని పేర్కొన్నారు.
"ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత, జవాబుదారీతనం ఎందుకు లేవు? సుమారు 300 మంది ప్రాణాలు పోయిన ప్రమాదానికి కారణాన్ని వెతికే బదులు.. ప్రభుత్వం కుట్ర సిద్ధాంతాలను తెరపైకి తెస్తోంది. ట్రాక్ నిర్వహణ సరిగా లేకపోవడం; ఇంటర్లాకింగ్, సిగ్నల్ వైఫల్యాల కారణంగా ఒడిశా రైలు ప్రమాదం జరిగింది. దీన్నుంచి దృష్టి మరలేలా అన్ని రకాల కుట్ర సిద్ధాంతాలను కేంద్రం ప్రచారం చేస్తోంది. 2016లోనూ రైలు ప్రమాద ఘటనపై ప్రభుత్వం ఎన్ఐఏను రంగంలోకి దించింది. కానీ, కుట్ర జరిగిందని చెప్పేందుకు ఎలాంటి ఆధారం దొరకలేదు" అని సుప్రియా శ్రీనేత్ విమర్శించారు.