Odisha Train Crash : ఒడిశా రైలు ప్రమాదం మాటలకందని విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో 275 మంది మరణించగా.. సుమారు 1,100 మందికి పైగా గాయాలపాలయ్యారు. వీరిలో అనేక మంది ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఇప్పుడు వీరికి అందుతున్న వైద్యంపైనే అందరి దృష్టి నెలకొంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దిల్లీ ఎయిమ్స్ సహా ఇతర ఆస్పత్రుల్లోని వైద్యుల బృందాన్ని వాయుసేన ప్రత్యేక విమానంలో భువనేశ్వర్‌కు పంపించింది. వీరితో పాటు హెవీ క్రిటికల్ కేర్ పరికరాలు, మందులను సైతం దిల్లీ నుంచి భువనేశ్వర్‌కు తరలించింది.
భువనేశ్వర్‌కు ఆరోగ్య మంత్రి
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ క్షతగాత్రులు చికిత్స పొందుతున్న భువనేశ్వర్ ఎయిమ్స్, కటక్ మెడికల్ కళాశాలను సందర్శించనున్నారు. బాధితులకు అందుతున్న వైద్యంపై ఆరా తీయనున్నారు. ఇందుకోసం ఆయన భువనేశ్వరక్ చేరుకున్నారు. క్షతగాత్రులకు వైద్యం అందించడానికి ఎయిమ్స్ భువనేశ్వర్‌కు చెందిన వైద్యుల బృందం ఇప్పటికే బాలేశ్వర్, కటక్ ఆస్పత్రులకు వెళ్లినట్లు మాండవీయ శనివారం చెప్పారు.
'ముందే అప్రమత్తంగా ఉంటే ఇలా జరిగేది కాదు'
Congress On Odisha Train Accident : రైలు ప్రమాదం జరిగిన తర్వాత అన్ని ఏర్పాట్లు చేశారని ఆరోపించారు రైల్వే శాఖ మాజీ సహాయ మంత్రి, కాంగ్రెస్ ఎంపీ అదీర్ రంజన్ చౌదరి. ఇలాంటి అప్రమత్తత ప్రమాదానికి ముందే ప్రదర్శించి ఉంటే ఇలా జరిగేది కాదన్నారు. కాంగ్రెస్ తరఫున ఘటన స్థలాన్ని పరిశీలించేందుకు రైల్వే శాఖ మాజీ సహాయ మంత్రిని పంపించారు జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే.
100 మృతదేహాలు భువనేశ్వర్‌కు తరలింపు
Odisha Train Accident Dead Bodies : మరోవైపు ప్రమాద స్థలం నుంచి 100 మృతదేహాలను ఎయిమ్స్ భువనేశ్వర్‌కు తరలించింది ఒడిశా ప్రభుత్వం. మృతదేహాలను భద్రపరిచి వాటిని కుటుంబసభ్యులకు అప్పగించేందుకే తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 55 మృతదేహాలను గుర్తించి శవపరీక్షల అనంతరం వారి కుటుంబాలకు అందజేసినట్లు చెప్పారు. ఆధారాలు లభించని మృతదేహాలను బహానగా హైస్కూల్, బిజినెస్ పార్క్ ఆవరణలో ఏర్పాటు చేసిన తాత్కాలిక మార్చురీల్లో భద్రపరచినట్లు వివరించారు.