తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒడిశా ప్రమాదంపై సీఎంల సంతాపం.. పరిహారం ప్రకటించిన స్టాలిన్.. వారి కోసం స్పెషల్ రైళ్లు - Odisha train accident Rescue operation completed

Odisha Train Accident : రైలు ప్రమాదంలో మరణించిన వారికి 5 లక్షల రూపాయల ఆర్థికసాయం ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. తమిళనాడుకు చెందిన మృతుల కుటుంబాలకు ఈ సహాయాన్ని అందించనున్నట్లు తెలిపింది. మరోవైపు గాయపడని ప్రయాణికులను ప్రత్యేక రైళ్లల్లో తమ గమ్యస్థానాలకు తరలించింది రైల్వేశాఖ. అదేవిధంగా గాయపడ్డవారికి 50వేల రూపాయలను ఆసుపత్రిలోనే అందించింది.

odisha-train-accident-tamil-nadu-cm-mk-stalin-announced-of-rs-5-lakh-compensation-to-families
ఒడిశా రైలు ప్రమాదంతమిళనాడు ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థికసాయం

By

Published : Jun 3, 2023, 1:59 PM IST

Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాద ఘటనపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన తమిళనాడు వాసుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఎక్స్​గ్రేషియా ప్రకటించారు ముఖ్యమంత్రి స్టాలిన్​. క్షతగాత్రులకు కూడా లక్ష రూపాయలను అందిస్తామన్నారు. ప్రమాదానికి సంబంధించిన సమాచారం ప్రజలకు చేరవేసేందుకు.. ఓ కంట్రోల్​ రూంను సైతం ఏర్పాటు చేసింది తమిళనాడు ప్రభుత్వం.

చైనైలోని ఎజిలగం, చెపాక్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ కంట్రోల్​ రూంను.. ముఖ్యమంత్రి స్టాలిన్ శనివారం​ సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. రైలు ప్రమాద ఘటనలో 230 తమిళులు మృతి చెందినట్లు సమాచారం ఉందని తెలిపారు. బంగాల్​ నుంచి చెన్నై వస్తున్న కోరమండల్​ ఎక్స్​ప్రెస్​లో​ ఈ ప్రయాణికులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. తమిళనాడుకు చెందిన మంత్రుల బృందాన్ని కూడా ఒడిశాకు పంపించినట్లు స్టాలిన్​ వివరించారు.

"ఇంకా ఎంత మంది ప్రమాదంలో బాధితులయ్యారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. అందుకోసమే అక్కడికి ఓ రెస్క్యూ టీంను పంపించాం. డీజీపీ సందీప్​ మిట్టర్​ ఆ బృందాన్ని సమన్వయం చేస్తారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయన్​ను ఫోన్​ ద్వారా సంప్రందించాను. రాష్ట్రం నుంచి కావాల్సిన సహాయం అందిస్తామని పట్నాయక్​కు తెలిపాను" అని స్టాలిన్ వెల్లడించారు.

ఒడిశాకు మమతా..
21వ దశాబ్దంలో జరిగిన అత్యంత ఘోరమైన ప్రమాదం ఇదేనని బంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. తాను రైల్వే శాఖ మంత్రిగా మూడుసార్లు పనిచేశానని గుర్తు చేసుకున్న దీదీ.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఒడిశా బాలేశ్వర్​లో ఘటన జరిగిన ప్రదేశాన్ని సందర్శించిన మమత.. అధికారులతో మాట్లాడారు.

కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తమ రాష్ట్ర ప్రయాణికుల సౌకర్యార్థం ఆయా ప్రభుత్వాలు హెల్ప్‌లైన్‌లు ఏర్పాటు చేశాయి. చాలా రాష్ట్రాలు తమ బృందాలను ప్రమాద స్థలికి పంపి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి.

ప్రత్యేక రైళ్లల్లో గాయపడని ప్రయాణికుల తరలింపు..
ప్రమాదంలో ఎటువంటి గాయాలు కానీ ప్రయాణికులను.. ప్రత్యేక రైళ్లల్లో వారు చేరుకోవాల్సిన గమ్యానికి తరలించినట్లు రైల్వేశాఖ వెల్లడించింది. ప్రయాణికులతో కూడిన ప్రత్యేక రైళ్లు బాలేశ్వర్, భద్రక్ నుంచి బయలుదేరాయని తెలిపింది. ఔషధాలు, వైద్య సిబ్బందితో ఈ రైళ్లు బయలుదేరాయని ప్రకటించింది. ఒక ప్రత్యేక రైలు భద్రక్ నుంచి చెన్నై వైపు బయలుదేరగా.. మరోవైపు 200 మంది ప్రయాణికులతో బాలేశ్వర్ నుంచి హౌరా వైపు ప్రత్యేక రైలు బయలుదేరింది. ప్రయాణికులకు ఆహారాన్ని కూడా అందించినట్లు రైల్వే శాఖ తెలిపింది.

గాయపడ్డవారికి 50వేల రూపాయలు!
ఒడిశా ఘోర రైలు ప్రమాదంలో స్వల్ప గాయాలైన బాధితులకు.. ఆస్పత్రిలోనే 50 వేల రూపాయలను అధికారులు అందించారు. పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు రైల్వే అధికారులు ఈ సాయాన్ని అందించారు. రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రైల్వే శాఖ 10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. తీవ్రంగా గాయపడ్డ వారికి 2 లక్షల రూపాయలు, స్వల్పంగా గాయపడ్డవారికి 50 వేల రూపాయలను ఇవ్వనుంది. ఇప్పటికే వందలమందికిపైగా ప్రమాద బాధితులకు రైల్వే అధికారులు నష్ట పరిహారం అందించారు.

ముగిసిన సహాయక చర్యలు..
రైలు ప్రమాద ఘటనలో సహాయక చర్యలు ముగిసాయని రైల్వేశాఖ ప్రతినిధులు తెలిపారు. రైలు ప్రమాదాల నివారణకు తీసుకువచ్చిన 'కవచ్​' వ్యవస్థ ఇక్కడ అందుబాటులో లేదని వారు వెల్లడించారు. సర్వీసు పునరుద్దరణ పనులు కూడా చేపట్టినట్లు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details