తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సిగ్నలింగ్‌ వ్యవస్థలో తీవ్ర లోపాలు'.. 3 నెలల క్రితమే రైల్వే ఉన్నతాధికారి వార్నింగ్​ - ఒడిశా రైలు విషాదం

మూడు నెలల క్రితం రైల్వే సిగ్నలింగ్‌ వ్యవస్థలో తీవ్రస్థాయి లోపాలు ఉన్నట్లు.. ఓ రైల్వే ఉన్నతాధికారి తన పైఅధికారులకు లేఖ రాశారు. ఒడిశా ప్రమాదం జరిగిన నేపథ్యంలో తాజాగా ఆ లేఖ వెలుగులోకి వచ్చింది. ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థ వైఫల్యాన్ని లేఖలో ఎత్తిచూపారు ఆ అధికారి.

odisha-train-accident-senior-railway-official-warned-on-signaling-system-3-months-ago
సిగ్నలింగ్‌ వ్యవస్థలో తీవ్ర లోపాలు.. 3 నెలల క్రితమే హెచ్చరించిన రైల్వే ఉన్నతాధికారి

By

Published : Jun 5, 2023, 7:24 AM IST

Updated : Jun 5, 2023, 8:40 AM IST

Odisha Train Accident Reason : రైల్వే సిగ్నలింగ్‌ వ్యవస్థలో తీవ్ర లోపాలున్నట్లు ఆ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి మూడు నెలల క్రితమే హెచ్చరించారు. తాజాగా ఒడిశాలో రైలు ప్రమాదం తర్వాత ఆ సంగతి వెలుగులోకి వచ్చింది. ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌లో మార్పు కారణంగానే బాలేశ్వర్​ రైలు ప్రమాదం జరిగిందని రైల్వే మంత్రి ప్రాథమికంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థ వైఫల్యాన్ని ఆ ఉన్నతాధికారి కొంతకాలం క్రితం ఎత్తిచూపిన విషయం చర్చనీయాంశమవుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 9న నైరుతి రైల్వే జోన్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ మేనేజర్‌.. ఉన్నతాధికారులకు ఓ లేఖ రాశారు. అంతకుముందు రోజు జరిగిన ఓ అనూహ్య ఘటనను ఆయన అందులో ప్రస్తావించారు.

"ఫిబ్రవరి 8న సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆరోజు వాస్తవానికి అప్‌ మెయిన్‌ లైన్‌లో వెళ్లేందుకు ఆ రైలుకు తొలుత అనుమతి వచ్చింది. కాకపోతే కొద్దిదూరం వెళ్లాక డౌన్‌ మెయిన్‌ లైన్‌లో వెళ్లేలా ఇంటర్‌లాకింగ్‌ ఉండటం కనిపించింది. దాన్ని గుర్తించిన లోకోపైలట్‌.. వెంటనే అప్రమత్తమయ్యారు. అనంతరం రైలును నిలిపివేశారు. ఇంటర్‌లాకింగ్‌ ఉన్న ప్రకారం.. లోకో పైలట్​ రైలు పోనిచ్చి ఉంటే.. ఘోర ప్రమాదం జరిగి ఉండేదే. సిగ్నలింగ్‌ వ్యవస్థలో తీవ్ర లోపాలు ఉన్నట్లు ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది." అని లేఖలో వివరించారు.

కొన్నిసార్లు సిగ్నల్‌ ప్రకారం రైలు ప్రారంభమయ్యాక.. అది వెళ్లాల్సిన ట్రాక్‌ మారిపోతోందని లేఖలో పేర్కొన్నారు. ఈ వైఫల్యాలను నివారించేలా తక్షణం దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన నొక్కిచెప్పారు. లేనిపక్షంలో ఘోర ప్రమాదాలు జరిగే ముప్పుందని.. నైరుతి రైల్వే జోన్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ మేనేజర్‌ తన లేఖలో హెచ్చరించారు.

ప్రమాదం జరిగింది ఇలా..
బహానగా రైల్వే స్టేషన్​లో లూప్‌ లైన్‌లో నిలిపి ఉంచిన గూడ్స్‌ రైలును కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ బలంగా ఢీకొట్టింది. దీంతో రైలు బోగీలు పట్టాలు తప్పి చెల్లాచెదురుగా పడిపోయాయి. పట్టాలు తప్పిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలు పక్క ట్రాక్‌పై పడ్డాయి. దీంతో అటువైపుగా వస్తున్న బెంగళూరు-హవ్‌డా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ చివరి బోగీలను ఢీకొట్టింది. ఘటనలో మొత్తం 275 మంది మృతి చెందారు. మరో వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థలో మార్పు వల్లే ప్రమాదం సంభవించిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

Last Updated : Jun 5, 2023, 8:40 AM IST

ABOUT THE AUTHOR

...view details