Odisha Train Accident Reason : ఒడిశాలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురైన ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి! ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థలో సెట్టింగ్స్ మార్పు వల్లే ఇంతటి ఘోరం జరిగిందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు ఆదివారం వెల్లడించారు. అయితే ఈ ఇంటర్‌లాకింగ్‌లో మార్పు ఎవరు చేసి ఉంటారు? ఎందుకు చేశారు? ఉద్దేశపూర్వకంగానే చేశారా? ప్రమాదం వెనుక కుట్ర ఏమైనా ఉందా? అనే ప్రశ్నలు రైల్వే అధికారులను వేధిస్తున్నాయి. విధ్వంసక చర్యకు పాల్పడేందుకే కొందరు వ్యక్తులు.. ఇంటర్‌లాకింగ్ వ్యవస్థలో మార్పు చేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఆ వ్యవస్థలో పొరపాటు జరిగేందుకే ఎటువంటి ఆస్కారం లేదని చెబుతున్నారు. కచ్చితంగా ఉద్దేశపూర్వకంగానే బయట వ్యక్తులు ఈ సెట్టింగ్స్ మార్పు చేసినట్లు అనుమానిస్తున్నారు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్‌ది ఎలాంటి తప్పులేదని నిర్ధరించుకున్నారు.
రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఏమన్నారంటే?
Train Accident Odisha : ఒడిశా రైలు ప్రమాదానికి పాయింట్ మెషీన్, ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ మార్పే కారణమని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. రైల్వే భద్రతా విభాగ కమిషనర్ దుర్ఘటనకు దారి తీసిన పరిస్థితులపై విచారణ జరిపారని ఆయన తెలిపారు. ప్రమాదానికి దారితీసిన తప్పిదాన్ని దర్యాప్తులో గుర్తించారని రైల్వే మంత్రి వెల్లడించారు. ఈ ప్రమాదానికి కారకులను కూడా గుర్తించారని వివరించారు. పూర్తి నివేదికను ఇంకా సమర్పించాల్సి ఉందన్నారు. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్‌లో మార్పు కారణంగానే ప్రమాదం జరిగిందని చెప్పారు.
"రైల్వే సేఫ్టీ అధికారి ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే సేఫ్టీ కమిషనర్ దర్యాప్తు నివేదిక వీలైనంత త్వరగా అందజేస్తారు. ఘోర ప్రమాదానికి మూల కారణమేంటన్నది ఇప్పటికే గుర్తించాం. ఈ సమయంలో నేను ప్రమాద కారణాలపై ఇంకా మాట్లాడడం సమంజసం కాదు. దర్యాప్తు నివేదిక అందనివ్వండి. కానీ ప్రమాదానికి గల కారణాలను, అందుకు బాధ్యులైన వ్యక్తులను గుర్తించాం. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌లో మార్పు కారణంగా ఈ ప్రమాదం జరిగింది. ఈ మార్పు ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అన్నది దర్యాప్తులో తేలుతుంది"
- అశ్వినీ వైష్ణవ్, రైల్వే మంత్రి
ఇంటర్ లాకింగ్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?
Interlocking System Railway : సాధారణంగా ఒకే పట్టాలపై ఏకకాలంలో రెండు రైళ్లు ఉండకుండా చూస్తూ పట్టాలను కేటాయించే సమగ్రమైన సిగ్నల్ వ్యవస్థ ఇది. రైలు ప్రయాణాలు సురక్షితంగా జరిగేలా చేయడం.. సిగ్నల్స్‌లో ఎటువంటి అవాంఛిత మార్పులు రాకుండా చూడటమే దీని ప్రాథమిక విధి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రయాణించే మార్గం పూర్తిగా సురక్షితం అని తనిఖీల్లో తేలేవరకు రైలుకు సిగ్నల్స్ ఇవ్వకుండా ఈ వ్యవస్థ ఆపి ఉంచుతుంది. ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ వినియోగంలోకి వచ్చిన అనంతరం రైళ్లు ఢీకొట్టడాలు, ప్రమాదాలు గణనీయంగా తగ్గాయని చెప్పొచ్చు.
Interlocking System Features : అయితే ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌లో వేగంగా స్పందించే అవకాశం, రైళ్ల నియంత్రణకు సౌకర్యవంతంగా ఉండటం, కచ్చితత్వం వంటి అనేక సానుకూలాంశాలు ఉన్నాయి. ఈ వ్యవస్థలో ట్రాక్‌పై రైళ్ల లొకేషన్లు గుర్తించడానికి సెన్సర్లు, ఫీడ్‌బ్యాకింగ్ పరికరాలు వాడతున్నారు. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ సురక్షితను పెంచేందుకు ట్రైన్ డిటెక్షన్ సిస్టమ్, సిగ్నల్స్, పాయింట్స్, ట్రాక్ సర్క్యూట్స్ వంటి వాటితో అనుసంధానమై పనిచేస్తుంది. దీంతో వాటిని సమన్వయం చేసుకుంటూ ఏకకాలంలో ఒకే మార్గంపై రెండు రైళ్లు రాకుండా చూస్తుంది. రూట్ సెట్టింగ్, రూట్ రిలీజ్, పాయింట్ ఆపరేషన్స్, ట్రాక్ ఆక్యూపెన్సీ మానిటరింగ్, ఓవర్‌లాప్ ప్రొటెక్షన్, క్రాంక్ హ్యాండిల్ ఆపరేషన్స్, లెవల్ క్రాసింగ్ గేట్ ఇంటర్‌లాకింగ్, ప్రొవిజన్ ఫర్ బ్లాక్ వర్కింగ్ వంటి పనులను చేస్తుంది.