Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యున్నత సమావేశం నిర్వహించారు. కీలక అధికారులతో ఆయన భేటీ అయి ప్రస్తుత పరిస్థితిపై చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఘటనాస్థలిలో జరుగుతున్న సహాయక చర్యలపై ఆయన ఆరా తీశారు. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
బాలేశ్వర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన నేపథ్యంలో ప్రధాని శనివారం ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. తొలుత మధ్యాహ్నం 2.30 గటంల సమయంలో 3 రైళ్లు ప్రమాదానికి గురైన ఘటనాస్థలానికి మోదీ చేరుకుంటారు. అక్కడ పరిస్థితిని ప్రత్యక్షంగా సమీక్షిస్తారు. అనంతరం ఘటనలో గాయాలపాలైన బాధితులను మోదీ పరామర్శిస్తారు. ఇందుకు కటక్‌లోని ఆస్పత్రికి మోదీ వెళ్లనున్నారు.
Odisha Train Tragedy : మరోవైపు ఈ ఘోర రైలు ప్రమాదంపై రైల్వే శాఖ ఉన్నతాధికారులతో ప్రధాని ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఈ సమీక్ష సమావేశంలో ప్రధాని దిశానిర్దేశం చేయనున్నారు. శనివారం మోదీ గోవాలో వందే భారత్ రైలును ప్రారంభించాల్సి ఉన్నా.. ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. ఇప్పటికే ఈ ప్రమాదంలో చనిపోయిన వారికి 10 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడ్డ వారికి 2 లక్షలు, స్వల్పగాయాలైన వారికి 50వేలు అందించాలని రైల్వేశాఖ నిర్ణయించింది.
Ashwini Vaishnaw Odisha : ఒడిశా బాలేశ్వర్‌లో మూడు రైళ్లు ఢీకొట్టిన ఘటనకు కారణాలను ప్రస్తుతానికి చెప్పలేమని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దర్యాప్తు కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే ప్రమాద కారణాలు తెలుస్తాయని చెప్పారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి.. ప్రస్తుతం సహాయక చర్యలపైనే పూర్తిగా దృష్టిసారించామన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు అశ్వినీ వైష్ణవ్ వివరించారు. అనంతరం ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు.