Odisha Train Accident Modi : ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తప్పవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మోదీ.. ఈ దుర్ఘటనపై ఇప్పటికే ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించామన్నారు. రైలు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ.. శనివారం మధ్యాహ్నం సందర్శించారు. అక్కడ పరిస్థితిని, సహాయక చర్యలను కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్‌తో కలిసి మోదీ ప్రత్యక్షంగా పరిశీలించారు. రైలు ప్రమాద ఘటన గురించి అక్కడ ఉన్న అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఒడిశా కేబినెట్ సెక్రటరీ, ఆరోగ్య శాఖ మంత్రిలో ప్రధాని మోదీ మాట్లాడారు. బాధితులకు అండగా ఉండాలని వారిని ప్రధాని మోదీ కోరినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో అధికారులు చేపట్టిన పునురుద్ధరణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైలు ప్రమాద ఘటనాస్థలిని పరిశీలించిన అనంతరం ప్రధాని మోదీ.. బాలేశ్వర్‌లో క్షతగాత్రుల చికిత్స పొందుతున్న ఆస్పత్రిని సందర్శించారు. క్షతగాత్రుల బాగోగులను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. ప్రధాని మోదీ.. రైలు ప్రమాద ఘటనాస్థలికి సందర్శించేందుకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్లో శనివారం మధ్యాహ్నం బాలేశ్వర్‌కు చేరుకున్నారు.
ఒడిశా రైలు ప్రమాద ఘటన అత్యంత దిగ్భ్రాంతికరమైన సంఘటన అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించే విషయంలో ప్రభుత్వం ఏ అవకాశాన్నీ వదిలిపెట్టదని ప్రధాని పేర్కొన్నారు. ఇది తీవ్రమైన సంఘటన అని.. దీనిపై అన్ని కోణాల్లో విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఘటనకు సంబంధించి దోషులుగా తేలిన వారిని కఠినంగా శిక్షిస్తామని అన్నారు. రైల్వే ట్రాక్ పునరుద్ధరణకు రైల్వే సిబ్బంది కృషి చేస్తున్నట్లు ప్రధాని వివరించారు. క్షతగాత్రులను కలిసి వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని వైద్యులకు సూచించినట్లు ప్రధానమంత్రి మోదీ వెల్లడించారు.