Kharge letter to PM : ఒడిశా రైలు ప్రమాద ఘటనపై రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నల వర్షం కురిపించారు. రైల్వేలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దకుండా.. బీజేపీ సర్కారు తన తప్పుడు నిర్ణయాలతో ప్రజలకు అనేక సమస్యలు సృష్టిస్తోందని ఆరోపించారు. రైల్వేల్లో భద్రతపై ఆ శాఖ మంత్రి చేసిన ప్రకటనలన్నీ అవాస్తవాలని తేలిపోయాయని అన్నారు. రైల్వేలో భద్రత కరవవడంపై సాధారణ ప్రయాణికుల్లో ఆందోళన ఏర్పడిందని చెప్పారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
"రైల్వేలో 3 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తాజా ప్రమాదం జరిగిన ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో 8278 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పీఎంఓ, కేబినెట్ కమిటీ నియమించే.. సీనియర్ పోస్టుల విషయంలోనూ ఇదే నిర్లక్ష్యం కనిపిస్తోంది. 90వ దశకంలో 18లక్షలకు పైగా రైల్వే ఉద్యోగులు ఉంటే.. ఇప్పుడు 12 లక్షలకు తగ్గింది. అందులోనూ 3.18 లక్షల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగాల ఫలితంగా రిజర్వేషన్ పొందే వర్గాలు తమ అవకాశాలు కోల్పోతున్నాయి.
సుదీర్ఘ పని గంటల వల్ల లోకో పైలట్లపై భారం పడుతోంది. సిబ్బంది లేకపోవడం వల్ల లోకో పైలట్లతో ఎక్కువసేపు పని చేయించుకుంటున్నట్లు ఇటీవలే రైల్వే బోర్డు తెలిపింది. రైల్వే సేఫ్టీ కమిషన్ సిఫార్సులను పట్టించుకోకపోవడంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ విమర్శలు గుప్పించింది. పట్టాలు తప్పుతున్న ఘటనలు జరుగుతున్నా.. సరైన టెస్టింగ్ నిర్వహించకపోవడాన్ని కాగ్ తన రిపోర్టులో ప్రస్తావించింది. కవచ్ వ్యవస్థ 4 శాతం మార్గాలకే ఎందుకు పరిమితమైంది? ఈ సమస్యలను గుర్తించేందుకు మీరు, రైల్వే మంత్రి సిద్ధంగా లేరు."
-మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు
Odisha train accident :మరోవైపు, ఒడిశా రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య విషయంపై బంగాల్ సీఎం మమతాబెనర్జీ అనుమానాలు వ్యక్తం చేశారు. తమ రాష్ట్రానికే చెందినవారు 61మంది మృతి చెందారని, మరో 182మంది ఆచూకీ తెలియకుండా పోయిందని పేర్కొన్నారు. ఈ లెక్కన.. అసలు గణాంకాలు సరైనవేనా అని ప్రశ్నించారు. వందేభారత్ రైలు ఇంజిన్ల సామర్థ్యంపైనా దీదీ అనుమానం వ్యక్తం చేశారు. ఒడిశా ఘటన విషాదకరమైనప్పటికీ.. బీజేపీ తీరే తనను ఈవిధంగా మాట్లాడేలా చేసిందని మమత అన్నారు. తాను, నీతీశ్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రులుగా ఉన్న సమయంలో జరిగిన రైలు ప్రమాదాల్లో చాలా మంది మరణించారని కొన్ని వర్గాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తాను రైల్వేమంత్రిగా ఉన్న సమయంలోనే కొత్త సిగ్నల్ వ్యవస్థ, యాంటీ కొలిజన్ డివైజ్‌ను ప్రవేశపెట్టినట్లు మమత గుర్తుచేశారు. తన హయాంలో ప్రవేశపెట్టిన దురంతో ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ప్రాధాన్యం లేకుండా చేశారని ఆరోపించారు.