Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాద ఘటనలో జరిగిన ప్రాణనష్టం తనను తీవ్రంగా కలిచివేసినట్లు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. మృతులకు సంతాపం, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ కూడా రైలు ప్రమాద ఘటనలో జరిగిన ప్రాణనష్టంపై విచారం వ్యక్తం చేశారు.
రైలు ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ప్రధాని మోదీ.. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఘటనాస్థలంలో సహాయ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నట్లు తెలిపారు. బాధితులకు అవసరమైన సాయం అందించనున్నట్లు భరోసా ఇచ్చారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు 2లక్షలు, గాయపడినవారికి 50వేల చొప్పున ఆర్థికసాయాన్ని ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి అందజేయనున్నట్లు ప్రకటించారు.
మృతులకు రూ.10 లక్షలు పరిహారం
మరోవైపు ఈ ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు 10లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 50వేల చొప్పున.. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పరిహారం ప్రకటించారు. చెన్నై-కోరమాండల్ రైలు ప్రమాదానికి గురికావటం వల్ల తమిళనాడు సీఎం స్టాలిన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో ఫోన్లో మాట్లాడారు. తమిళ ప్రయాణికులను కాపాడేందుకు అవసరమైన సహాయ చర్యలను సమన్వయం చేసేందుకు నలుగురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. రవాణా శాఖ మంత్రి శివశంకర్‌తోపాటు ముగ్గురు ఐఏఎస్‌లను ఒడిశాకు వెళ్లాలని ఆదేశించారు. హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని సీఎం స్టాలిన్ అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు తమ రాష్ట్రం నుంచి వైద్య బృందాలను పంపేందుకు సీఎం స్టాలిన్.. సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తమిళనాడు అధికారులు తెలిపారు.
సహాయ చర్యల్లో పాల్గొనాలని కాంగ్రెస్ పిలుపు
రైలు ప్రమాద ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయచర్యల్లో పాల్గొనాలని పార్టీ నేతలు, శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమవారిని కోల్పోయిన బాధిత కుటుంబాలకు మనో ధైర్యం ఇవ్వాలని ప్రార్థించినట్లు ట్వీట్ చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ కూడా రైలు ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు. చనిపోయినవారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేశారు. కాాగా శనివారాన్ని సంతాపం దినంగా ప్రకటించింది ఒడిశా ప్రభుత్వం.
ప్రమాదం జరిగింది ఇలా..
ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో అనూహ్య రీతిలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 278 మంది మృతి చెందారు. 900 మందికి పైగా గాయాపడ్డారు. బెంగళూరు-హావ్‌డా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ బాలేశ్వర్ సమీపంలోని బహానగా బజార్ వద్ద శుక్రవారం రాత్రి దాదాపు ఏడు గంటల ప్రాంతంలో తొలుత పట్టాలు తప్పింది. ఫలితంగా దాని బోగీలు పక్కనే ఉన్న ట్రాక్‌పై పడ్డాయి. వాటిని షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. దాంతో కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన పదిహేను బోగీలు బోల్తాపడ్డాయి. అనంతరం బోల్తాపడ్డ కోరమండల్ కోచ్‌లను పక్కనున్న ట్రాక్‌పై దూసుకొచ్చిన గూడ్సు రైలు ఢీకొంది. మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోవడం వల్ల ప్రమాదం తీవ్రత పెరిగింది. ఘటన జరిగిన గురైన సమయంలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ కోల్‌కతా నుంచి చెన్నైకి వెళ్తోంది.