Odisha Train Tragedy : ఒడిశాలోని బాలేశ్వర్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదానికి రాంగ్ సిగ్నలింగ్తో పాటు టెలికమ్యూనికేషన్ వ్యవస్థలోని లోపాలే కారణమని ఉన్నతస్థాయి దర్యాప్తు బృందం తేల్చింది. వివిధ స్థాయిల్లో ఈ పొరపాట్లు జరిగినట్లు రైల్వే సేఫ్టీ కమిషన్ నివేదిక స్పష్టం చేసింది. భద్రతా ప్రమాణాలు పాటించి ఉంటే దుర్ఘటన జరిగి ఉండేది కాదని కమిటీ పేర్కొంది. గతంలో ఇదే తరహాలో జరిగిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుని ఉంటే ఈ రైలు ప్రమాదం తప్పేదని అభిప్రాయపడింది. ప్రమాదంపై సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్ విభాగం రైల్వే బోర్డుకు నివేదిక అందించింది. ఈ మేరకు ప్రమాదంపై సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్ విభాగం రైల్వే బోర్డుకు దర్యాప్తు నివేదికను రైల్వే సేఫ్టీ కమిషన్ సమర్పించింది.
Odisha Train Accident Cause : రాంగ్ వైరింగ్, రాంగ్ కేబుల్ వల్ల 2022 మే 16న ఇదే తరహా దుర్ఘటన ఖరగ్‌పుర్ డివిజన్‌లోని బ్యాంక్రనాయబాజ్ స్టేషన్ వద్ద జరిగిందని నివేదిక పేర్కొంది. అప్పుడే దాన్ని సరి చేసే చర్యలు తీసుకుని.. రాంగ్ వైరింగ్ సమస్యను పరిష్కరించి ఉంటే బహనగబజార్ వద్ద ఈ ఘోర ప్రమాదం సంభవించేది కాదని అభిప్రాయపడింది. సిగ్నలింగ్-సర్క్యూట్ మార్పులో లోపాలే ప్రమాదానికి కారణమని తేల్చింది.