Odisha Train Accident : ఒడిశాలో మాటలకందని మహా విషాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘోర రైలు ప్రమాదంతో దేశం ఒక్కసారిగా... ఉలిక్కిపడింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 280 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. చాలామంది క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండడం వల్ల మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి రైలు ప్రమాదం జరిగిన సమయంలో ఏ క్షణం ఏం జరిగిందనేది అధికారులు ఆరా తీశారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
Odisha Train Accident Time : శుక్రవారం రాత్రి.. ఎప్పుడేం జరిగింది?
- 6.50 PM: లూప్ లైన్‌లో నిలిపి ఉంచిన గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బలంగా ఢీకొట్టడం వల్ల అందులోని ప్రయాణికులకు భారీ శబ్ధం వినిపించింది. రైలు బోగీలు పట్టాలు తప్పి చెల్లాచెదురుగా పడిపోయాయి.
- 6.55 PM: పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలు పక్క ట్రాక్‌పై పడ్డాయి. దీంతో అటువైపుగా వస్తున్న బెంగళూరు-హవ్‌డా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ చివరి బోగీలను ఢీకొట్టింది.
- 7.10 PM: ప్రమాదంపై విషయం తెలుసుకున్న స్థానికులు ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు.7.30 PM: స్థానిక అధికారులు, పోలీసులు, అత్యవసర సహాయ సిబ్బంది ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు.
- 8.00-9:00 PM: ఆ తర్వాత బీఆర్ సింగ్ ఆస్పత్రి నుంచి పెద్ద సంఖ్యలో వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ఆర్థోపెడిక్, ఈస్ట్రన్ రైల్వే ఆస్పత్రి సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
- 9.30 PM: స్వల్పంగా గాయపడిన వారిని సమీపంలో ఉన్న ఆస్పత్రులకు తరలించేందుకు డివిజనల్ మేనేజర్ బస్సులను ఏర్పాటు చేశారు.
- 9.59 PM : ముంబయి-గోవా వందేభారత్ రైలు ప్రారంభోత్సవాన్ని రద్దు చేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది.