తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలోనే అతిపెద్ద 'జాబ్​ స్కామ్​' బట్టబయలు.. బాధితుల్లో ఆంధ్రా యువత

దేశంలోనే అతిపెద్ద ఉద్యోగాల కుంభకోణాన్ని బట్టబయలు చేసినట్లు ప్రకటించారు ఒడిశా పోలీసులు. ఉత్తర్​ప్రదేశ్​ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తూ ఐదు రాష్ట్రాల నిరుద్యోగుల్ని మోసం చేసిన ముఠాలో కీలక నిందితుడ్ని అరెస్టు చేశారు.

Odisha Police unearths massive job scam, arrests one from UP
జాబ్ స్కాం

By

Published : Jan 1, 2023, 8:40 AM IST

ప్రభుత్వం పేరుతో ఉద్యోగాల ప్రకటనలు.. అధికారిక సైట్లను తలపించేలా ఫేక్​ వెబ్​పేజెస్.. తియ్యటి మాటలు చెప్పే 50 మంది కాల్​ సెంటర్​ సిబ్బంది.. ట్రైనింగ్, రిజిస్ట్రేషన్​ పేరుతో ఒక్కొక్కరి నుంచి వేల రూపాయలు వసూలు..! దేశంలోనే అతిపెద్ద 'జాబ్​ స్కామ్​'గా చెబుతున్న ఓ భారీ కుంభకోణం సంక్షిప్త రూపమిది. కొందరు ఇంజినీర్లు కలిసి సాగిస్తున్న ఈ కోట్లాది రూపాయల మోసం.. ఒడిశా పోలీసుల దర్యాప్తుతో వెలుగులోకి వచ్చింది.

ఉత్తర్​ప్రదేశ్​లోని అలీగఢ్​ కేంద్రంగా పనిచేస్తున్న ఈ ముఠా.. హైటెక్ పద్ధతుల్లో దేశంలోని నిరుద్యోగులకు టోకరా వేస్తోందని శనివారం వెల్లడించారు ఒడిశా పోలీసులు. గుజరాత్​, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, బంగాల్, ఒడిశాకు చెందిన నిరుద్యోగ యువతను వీరు మోసగిస్తున్నారని గుర్తించామని తెలిపారు. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన జాఫర్ అహ్మద్​(25)ను అలీగఢ్​ సివిల్స్ లైన్స్ ప్రాంతంలో అరెస్టు చేసినట్లు ప్రకటించారు. స్థానిక కోర్టులో అతడ్ని ప్రవేశపెట్టి.. ఐదు రోజుల ట్రాన్సిట్ రిమాండ్​తో భువనేశ్వర్​ తరలిస్తున్నట్లు ఒడిశా ఆర్థిక నేరాల విభాగం పోలీసులు చెప్పారు.

"నిందితుడ్ని అరెస్టు చేయడంలో సహకరించిన అలీగఢ్​ పోలీసులకు కృతజ్ఞతలు. ఈ కుంభకోణంలో ఇంకెవరు ఉన్నారు, ఎంత సొమ్ము చేతులు మారిందో తెలుసుకునేందుకు దర్యాప్తు సాగుతోంది" అని తెలిపారు ఆర్థిక నేరాల విభాగం డీఐజీ జేఎన్​ పంకజ్. కనీసం 50వేల మంది నిరుద్యోగులు ఈ ముఠా బారినపడి మోసపోయి ఉంటారని ఒడిశా పోలీసు అధికారులు అంచనా వేశారు.

ఫేక్​ వెబ్​సైట్లతో టోకరా
పోలీసుల కథనం ప్రకారం.. అరెస్టయిన జాఫర్​ అహ్మద్​ బీటెక్ చదివాడు. ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన మరికొందరు ఇంజినీర్లతో కలిసి ఈ దందా సాగించాడు. వీరికి కొందరు వెబ్​సైట్ డెవలపర్లు సాయం చేశారు. జమల్​పుర్​, అలీగఢ్​కు చెందిన 50 మందితో ఓ ప్రత్యేక కాల్​ సెంటర్​నూ నడిపేవారు. వీరికి నెలకు రూ.15వేలు జీతం ఇచ్చేవారు.

నిరుద్యోగ యువతే వీరి టార్గెట్. అచ్చు ప్రభుత్వ వెబ్​సైట్​ను తలపించేలా ఓ ఫేక్ వెబ్​సైట్​ను సృష్టించేవారు. ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయంటూ ప్రకటనలు ఇచ్చేవారు. నిరుద్యోగుల దృష్టిని ఆకర్షించేందుకు, వారిని నమ్మించేందుకు ప్రధాన మంత్రి పేరిట ఉన్న పథకాల కింద ఈ ఉద్యోగాలు ఇస్తున్నట్లు చెప్పేవారు. కొన్ని స్థానిక పత్రికల్లోనూ వీరు ప్రకటనలు ఇచ్చేవారు. ఈ యాడ్స్​ చూసి అప్లై చేసినవారందరినీ వీరు సెలక్ట్ చేసేవారు. రిజిస్ట్రేషన్,​ ఇంటర్వ్యూ ట్రైనింగ్ పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ.3వేలు-రూ.50వేలు వసూలు చేసేవారు.

తమ గుట్టు బయటకుండా చూసుకునేందుకు ఈ ముఠా ఎంతో స్మార్ట్​గా వ్యవహరించింది. పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలకు చిక్కకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. వెయ్యికిపైగా ఫేక్ సిమ్​కార్డులు, 530 మొబైల్​ ఫోన్లు ఉపయోగించింది. పర్సనల్ మొబైల్స్​ ఎట్టి పరిస్థితుల్లోనూ వాడేవారు కాదు. ఫేక్ సిమ్​ కార్డులు ఉన్న ఫోన్లతో వాట్సాప్ వాయిస్​ కాల్స్​లో మాత్రమే వీరు మాట్లాడుకునేవారు. నంబర్ ఎవరిదో తెలియకుండా ఉండేందుకు ఉద్యోగం ఇచ్చే ప్రభుత్వ పథకం పేరుతోనే కాంటాక్ట్ సేవ్ చేసేవారు. ఎవరైనా ట్రూకాలర్​లో చూసినా.. ఆ పథకం పేరు మాత్రమే కనిపించేది. నగదు వసూలులోనూ ఇంతే. ఇతరుల పేర్లతో ఉన్న 100 బ్యాంకు ఖాతాలను వీరు ఉపయోగించేవారు. నిరుద్యోగులు ఆయా ఖాతాల్లో జమ చేసిన డబ్బును జన సేవా కేంద్రాల ద్వారా మాత్రమే విత్​డ్రా చేసేవారు. ఇలా చాకచక్యంగా వేలాది మందిని మోసం చేసి, కోట్ల రూపాయలు కొట్టేసిన ముఠా చివరకు ఒడిశా పోలీసులకు చిక్కింది.

ABOUT THE AUTHOR

...view details