Odisha new cabinet: ఒడిశాలో నూతన మంత్రివర్గం కొలువుదీరింది. బిజు జనతా దళ్ నేతలు జగన్నాథ్ సరక, నిరంజన్ పూజారి సహా 13 మంది ఎమ్మెల్యేలు కేబినెట్ మంత్రులుగా, మరో 8 మంది స్వతంత్ర హోదాతో సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రివర్గంలోని అందరనీ రాజీనామా చేయాలని శనివారం సీఎం నవీన్ పట్నాయక్ ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు 20 మంది రాజీనామాలు సమర్పించగా.. కొత్త మంత్రివర్గానికి మార్గం సుగమమైంది. భువనేశ్వర్‌లోని లోక్‌సేవ భవన్ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఒడిశా గవర్నర్ గణేశీ లాల్.. సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. కొత్త మంత్రివర్గంలో ముగ్గురు మహిళలు ఉన్నారు. ప్రమీళా మల్లిక్, ఉషా దేవి, తుకుని సాహును సీఎం.. తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు.
మరోవైపు, శనివారం తన పదవికి రాజీనామా చేసిన అసెంబ్లీ స్పీకర్ ఎస్ఎన్ పాత్రో.. మంత్రివర్గంలో చేరడం లేదని తెలుస్తోంది. పాత్రో మంత్రివర్గంలో చేరతారని ఊహాగానాలు రాగా.. వాటిని ఆయన కుమారుడు బిప్లవ్ తోసిపుచ్చారు. అనారోగ్య కారణాలతోనే తన తండ్రి రాజీనామా చేసినట్లు తెలిపారు. ఆయనకు ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స జరుగుతోందని చెప్పారు. శనివారం మంత్రి పదవికి రాజీనామా చేసిన బీకే అరుఖా.. స్పీకర్ పదవిని చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.