అదో మారుమూల గ్రామం. నగరానికి దూరంగా విసిరి పారేసినట్లు ఉంటుంది. కనీసం మట్టి రోడ్డు కూడా లేని.. ఆ ఊరుకు వెళ్లాలంటే అడవిని దాటాల్సిందే. తెలియనివారైతే.. కారడవిలో తప్పిపోవడం ఖాయం! అందుకే ఆ గ్రామాన్ని పట్టించుకునే నాథుడు కరవయ్యాడు. ఈ దుస్థితిని గుర్తించిన ఇద్దరు సోదరులు.. రోడ్డు నిర్మించాలని భీష్మించుకున్నారు. 30 ఏళ్లు నిర్విరమంగా శ్రమించి రోడ్డును నిర్మించారు.
ఒడిశాలోని నయాగఢ్ జిల్లాలోని బంతపుర్ పంచాయతీ పరిధిలో ఉంటుంది తులుబి గ్రామం. రోడ్డు సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోని దుస్థితి. అందుకే ఆ ఊరికి చెందిన హరిహర్ బెహెర సోదరులు.. రోడ్డు నిర్మించాలన్న మహత్తర కార్యానికి నడుం బిగించారు.