ఒడిశాలోని బాలేశ్వర్ ట్రాఫిక్ పోలీసులు తీరుపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. హెల్మెట్ లేకుండా బాలేశ్వర్ శాసనసభ్యుడు స్వరూప్ దాస్ బైక్‌ను నడిపారు. ఆయనతో పాటు బైక్‌పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సమీర్ రంజన్ దాస్ ఉన్నారు. హెల్మెట్ లేకుండా బైక్ నడిపినందుకుగానూ ఎమ్మెల్యేకు రూ.1000 జరిమానా విధించారు ట్రాఫిక్ పోలీసులు.
అనంతరం ఎమ్మెల్యే స్వరూప్ దాస్ స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిమానా చెల్లించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అంతకుముందు ఎమ్మెల్యే స్వరూప్ దాస్‌తో కలిసి బాలేశ్వర్‌లోని పట్టణంలోని వివిధ పాఠశాలల్లో అకస్మిక తనిఖీలు నిర్వహించారు విద్యాశాఖ మంత్రి సమీర్ రంజన్ దాస్. బాలేశ్వర్ టౌన్ హైస్కూల్, బారాబతి బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాలల్లో ఉన్న సమస్యలపై విద్యార్థులు, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.