Odisha IT Raids :పన్ను ఎగవేత ఆరోపణలపై ఒడిశాలోని మద్యం వ్యాపారి ఇంటిపై గత మూడు రోజులుగా సోదాలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు శుక్రవారం 156 బ్యాగుల నిండా నగదును స్వాధీనం చేసుకున్నారు. తాజాగా స్వాధీనం చేసుకున్న బ్యాగుల్లో ఆరేడు బ్యాగులను మాత్రమే లెక్కించామని, వీటిల్లో రూ.20 కోట్లు మాత్రమే ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు రూ.220 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సంబల్‌పుర్, బోలన్‌గిరి, టిట్లాగఢ్, బౌద్ధ్, సుందర్‌గఢ్, రవూర్కెలా, భువనేశ్వర్‌లో ఈ సోదాలు జరిగాయి. ఈ సోదాలపై సదరు మద్యం కంపెనీ ఇంతవరకు స్పందించలేదు.
'ప్రతి రూపాయినీ వెనక్కి రప్పిస్తాం'
మరోవైపు ఝార్ఖండ్‌కు చెందిన ఓ ఎంపీకి కూడా లిక్కర్ కంపెనీతో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. రాంచీలోని ఆయన కార్యాలయానికి వెళితే ఎంపీ అందుబాటులో లేరని సమాధానం వచ్చింది. ఈ ఘటనపై ప్రధాని మోదీ సామాజిక మధ్యమం ఎక్స్ ద్వారా స్పందించారు. నోట్ల కట్టలు బయటపడ్డ వార్తకు సంబంధించిన క్లిప్పింగును ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ నోట్ల గుట్టలను చూసి నాయకులు చెప్పే నీతి వాక్యాలు వినాలని వ్యంగ్యంగా అన్నారు. ప్రజల నుంచి దోచుకున్న సొమ్మును ప్రతి రూపాయినీ వెనక్కి రప్పిస్తామని, ఇది మోదీ హామీ అంటూ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.