ఆన్‌లైన్ వేదికగా పరిచయం, ప్రేమ, పెళ్లి.. అనేవి తరచూ వింటూనే ఉన్నాం. అయితే.. ఆన్‌లైన్ గేమింగ్ యాప్లో పరిచయమైన ఓ యువకునితో ప్రేమలో పడిన ఓ యువతి(19).. అతడిని పెళ్లి కూడా చేసుకుంది. కానీ అతడికి పెళ్లి వయస్సు రాలేదనే సమాచారం అందుకున్న అధికారులు.. వారి వివాహం చెల్లదని తేల్చి చెప్పారు.
ఒడిశా టు హరియాణా..
ఒడిశాకు చెందిన ఓ యువతికి.. హరియాణాలోని పానిపత్కు చెందిన ఓ యువకునితో లూడో గేమింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. అదికాస్తా ప్రేమగా మారి.. పెళ్లి చేసుకునేవరకు దారితీసింది. అయితే యువతి కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. దీనితో ఇంట్లో నుంచి పానిపత్కు పారిపోయి పెళ్లి చేసుకుంది ఆ యువతి. అయితే ఈ ఘటనపై సమాచారం అందుకున్న బాల్య వివాహాల నిషేధ అధికారి రజనీ గుప్తా తన బృందంతో అక్కడకు చేరుకుని వివాహాన్ని నిలిపేశారు.
"ఆన్లైన్లో లూడో గేమ్ ఆడుతుండగా వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇద్దరికీ రెండేళ్లుగా పరిచయం ఉంది. యువతి కుటుంబ సభ్యులెవరూ వివాహానికి హాజరుకాలేదు. ఆమె తల్లికి ఈ వివాహం ఇష్టం లేదు. అక్టోబర్ 2న ఈ యువతి తన అక్కకు సమాచారం అందించి ఇంట్లో నుంచి పారిపోయి వచ్చింది."