ఒడిశా మాజీ ముఖ్యమంత్రి హేమానంద బిశ్వాల్ (83) శుక్రవారం రాత్రి భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజుల క్రితం ఆయన అస్వస్థతకు గురయ్యారు. పశ్చిమ ఒడిశా జిల్లాల్లో ప్రముఖ ఆదివాసీ నేత అయిన బిశ్వాల్ కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలందించారు.
రాజకీయ ప్రస్థానమిదే..
ఝార్సుగుడ జిల్లా ఠాకూర్‌పడలో జన్మించిన ఆయన సుందర్‌గఢ్ జిల్లా నుంచి రాజకీయాలు నడిపారు. 1974లో తొలిసారిగా లైకిడ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తర్వాత వరుసగా అయిదుసార్లు శాసనసభకు ప్రాతినిథ్యం వహించిన ఆయన జేబీ పట్నాయక్ మంత్రివర్గంలో పలుశాఖల మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. 1999 నుంచి 2000 వరకు ముఖ్యమంత్రిగా సేవలందించారు. 2009 నుంచి 2014 వరకు సుందర్‌గఢ్ ఎంపీగా సమర్థ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందారు.