ఒడిశా రాష్ట్రంలోని ఝార్సుగూడ జిల్లా కిర్మిరా బ్లాక్ పరిధిలోని భౌంరా గ్రామ సమీపంలో ఏనుగు ఇద్దరు మైనర్ సోదరులను వారి తల్లిదండ్రుల ముందే తొక్కి చంపింది. పిల్లలను రక్షించే ప్రయత్నంలో దంపతులకు తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో వారిని ఝార్సుగూడ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని శక్తి జిల్లాకు చెందిన ఉమేష్ రామ్ సత్నామీ, అతని భార్య లెహెరాబాయి సత్నామీ వారి ఇద్దరు కుమారులు ధనంజయ్ (9), అభయ్ (11)తో కలిసి ఒక ఇటుక బట్టీలో పని చేయడానికి గ్రామానికి వచ్చారు. వీరంతా నిద్రిస్తుండగా ఇద్దరు అన్నదమ్ములపై ఏనుగు దాడి చేసింది. ఎంత ప్రయత్నించినా తమ బిడ్డలను తల్లిదండ్రులు కాపాడుకోలేకపోయారు. ఏనుగు తొక్కేయడం వల్ల బాలురు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ క్రమంలో ఉమేష్, లెహెరాబాయిలకు గాయాలు అయ్యాయి. వీరిని ఆస్పత్రిలో చేర్పించారు.