తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Dec 13, 2023, 4:45 PM IST

ETV Bharat / bharat

బల్బు, పాత బాటిల్- బోరుబావిలో పడిన చిన్నారి ప్రాణాలు కాపాడాయిలా!

Odisha Child Stuck In Borewell Rescued : ఒడిశా బోరుబావి ఘటనలో చిక్కుకున్న ఓ నవజాత శిశువు ప్రాణాలతో బయట పడటంలో కీలక పాత్ర పోషించాయి రెండు వస్తువులు. అందులో ముఖ్యమైనది ప్సాస్టిక్​ బాటిల్​ కాగా, మరొకటి 100 వాట్ల గాజు బల్బు. ఎలాగంటే?

Infant Trapped In Abandoned Borewell Rescued Alive
Odisha Child Stuck In Borewell Rescued

Odisha Child Stuck In Borewell Rescued : బోరుబావిలో పడిన నవజాత శిశువు.. చిమ్మచీకటి.. వణికించే చలి.. ఎలాగైనా పసిబిడ్డ ప్రాణాలు కాపాడాలని పదుల సంఖ్యలో సహాయక సిబ్బంది, పోలీసుల ప్రయత్నాలు.. చుట్టూ వందలాది మంది ప్రజల ప్రార్థనలు.. మంగళవారం ఒడిశాలోని ఓ చిన్న గ్రామంలో నెలకొన్న​ పరిస్థితి ఇది. చివరకు అందరి ఆశలు నెరవేరాయి. అనేక గంటల తర్వాత ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది. ఈ అద్భుతం జరగడం వెనుక రెండు వస్తువులు కీలక పాత్ర పోషించాయి. నవజాత శిశువు చిక్కుకున్న బోరుబావిలో అంతకుముందే పడి ఉన్న ఓ ఖాళీ ప్లాస్టిక్​ బాటిల్​, మహా అయితే రూ.15-20 విలువ చేసే ఓ 100 వాట్ల గాజు బల్బు ఆ అమాయకపు పసిబిడ్డను ప్రాణాలతో బయటపడేలా చేశాయి.

నవజాత శిశువు పడ్డ బోరుబావి ఇదే

ఆ రెండు వస్తువులు.. ఇలా కాపాడాయి!
ఒడిశా సంబల్​పుర్​ జిల్లాలోని లారిపలి గ్రామంలో నిరుపయోగంగా ఉన్న ఓ అనధికారక బోరుబావిలో కొద్దిరోజుల వయసు కలిగిన ఓ ఆడశిశువు మంగళవారం రాత్రి ప్రమాదవశాత్తు పడిపోయింది. బోరుబావి రంధ్రంలో చిక్కుకున్న ఆ నవజాత శిశువును రెస్క్యూ బృందాలు ఐదు గంటలపాటు తీవ్రంగా శ్రమించి రక్షించాయి. ఇందుకోసం పెద్ద ఎత్తున భారీ యంత్రాలను వినియోగించారు.

సహాయక చర్యల్లో రెస్క్యూ సిబ్బంది

రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్న సమయంలో ఆ ప్రాంతంలో తీవ్రమైన చలి ఉంది. ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్​కు క్షీణించింది. దీంతో బావిలో పడ్డ చిన్నారికి కావాల్సిన వెచ్చదనాన్ని అందించేందుకు అధికారులు 100 వాట్ల బల్బును రంధ్రం లోపలికి పంపించారు. తద్వారా చిన్నారి శరీరానికి కావాల్సిన వేడిని అధికారులు బల్బు ద్వారా అందించారు. అంతేకాకుండా 20 అడుగుల లోతులో చిక్కుకుని ఊపిరి ఆడని పరిస్థితుల్లో ఉన్న ఆ శిశువుకు ఆక్సిజన్​ను సరఫరా చేసి కాస్త ఉపశమనం కల్పించారు.

బోరుబావిలో అంతకుముందే ఎవరో పడేసిన ఓ ప్లాస్టిక్​ బాటిల్​ మధ్యలోనే చిక్కుకుని ఉంది. దానిపైనే చిన్నారి పడింది. ఒకవేళ అది లేకపోయుంటే ఆ చిన్నారి మరింత లోతుకు వెళ్లిపోయేదని బోరుబావి నిపుణులు కొందరు చెబుతున్నారు. పాపను బావిలో నుంచి బయటకు తీసినప్పుడు ఒంటిపై ఎలాంటి దుస్తులు లేవని చెప్పారు అధికారులు.

సహాయక చర్యల్లో రెస్క్యూ సిబ్బంది

"బోరుబావిలోకి ముందుగా ఆక్సిజన్​ను సరఫరా చేశాము. అప్పటికే ఏడుస్తున్న పాప కాసేపు ఏడ్పు ఆపింది. మళ్లీ ఏడవటం మొదలుపెట్టింది. ఈ క్రమంలో లోపల వెలుగు కోసం, అలాగే చలిగా ఎక్కువగా ఉన్నందున చిన్నారికి వెచ్చగా ఉండేందుకు 100 వాట్లున్న ఓ ఎలక్ట్రిక్​ బల్బును లోపలికి పంపించాము. అప్పుడు మళ్లీ ఏడ్పు ఆపేసింది. ఈ బల్బు టెక్నిక్​ ఆ చిన్నారికి వెచ్చదనాన్ని ఇచ్చే ఓ వార్మర్​లా మారింది. ఇలాంటి పద్ధతినే ఐసీయూల్లో ఉండే నవజాత శిశువుల సౌకర్యం కోసం వాడతారు."
- సింగ్హా, రెస్క్యూ సిబ్బంది

ప్రత్యేక అంబులెన్స్​లో గ్రీన్​ కారిడార్​ను ఏర్పాటు చేసి బాధిత చిన్నారిని సంబల్​పుర్​లోని వీర్​ సురేంద్ర సాయి మెడికల్​ కాలేజీ అండ్​ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఆ నవజాత శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం.

5 గంటల సుదీర్ఘ ఆపరేషన్​ తర్వాత ప్రాణాలతో బయటపడ్డ చిన్నారి

'కావాల్సిన వారే పడేశారని అనుమానం'
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు పాప తల్లిదండ్రులు ఎవరో కూడా ఇంకా తెలియలేదని పోలీసులు చెప్పారు. శిశువు తల్లిదండ్రులెవరో ఇంకా తెలియలేదని పేర్కొన్నారు. వాడకంలో లేని బోరుబావి గ్రామానికి దగ్గర్లో ఉన్న అడవిలో ఉందని, శిశువు అక్కడకు ఎందుకు వెళ్లింది? అందులో ఎలా పడిపోయింది.? అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.

పసికందును ఎవరో తెలిసివారే కావాలని బోరుబావిలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఈ రెస్క్యూ ఆపరేషన్​ విజయవంతం కావడం పట్ల ఒడిశా ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. సహాయక చర్యల్లో పాల్గొన్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

కాపాడిన నవజాతి శిశువును ఒడ్డుకు చేరుస్తున్న అధికారులు

బోరుబావిలో చిక్కుకున్న నవజాత శిశువు సేఫ్!- ఆస్పత్రిలో చికిత్స

పంబాకు వాహనాలు నో ఎంట్రీ- రోడ్డుపైనే పాటలు పాడుతూ అయ్యప్ప భక్తుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details