Odisha Cash Seizure :ఒడిశాకు చెందిన ఓ డిస్టిలరీ గ్రూపునకు సంబంధించి వివిధ ప్రాంతాల్లో చేపట్టిన సోదాల్లో స్వాధీనం చేసుకున్న లెక్కల్లోకి రాని సొమ్ము రూ. 351కోట్లు అని తేలింది. వీటితో పాటు రూ.2.80 కోట్ల విలువైన ఆభరణాలు సైతం ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) వెల్లడించింది. ఈ గ్రూపు ఝార్ఖండ్ రాంచీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడికి చెందినదని చెప్పింది. డిసెంబర్ 6న ఒడిశాతో పాటు ఝార్ఖండ్, బంగాల్లోని 10 జిల్లాలోని 30 ప్రాంతాల్లో సోదాలు చేపట్టినట్లు పేర్కొంది. అయితే, ఈ సంస్థ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహూకు చెందిన బౌద్ధ్ డిస్టిలరీ అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
లెక్కల్లో చూపని దేశీ మద్యం అమ్మకానికి సంబంధించిన రికార్డులు, నగదు రశీదులు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిందని సీబీడీటీ తన అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ నగదులో అధిక మొత్తం మద్యం అమ్మకాల ద్వారానే అర్జించినట్లు చెప్పింది. లభ్యమైన మొత్తం నగదులో రూ. 329 కోట్లు ఒడిశాలోని తితిలాగఢ్, సుదాపద లాంటి చిన్న పట్టణాల్లో ఖాళీగా ఉన్న పలు భవనాల్లో దొరికినట్లు ప్రకటనలో పేర్కొంది. దీంతో పాటు సోదాల్లో లభ్యమైన నగదుకు సంబంధించిన ఫొటోలను విడుదల చేసింది. లెక్కల్లో చూపని నగదు ఉందని సోదాల అనంతరం సంస్థ ఉద్యోగులు అంగీకరించారు. వీరితో పాటు వ్యాపారం నిర్వహించే కుటుంబసభ్యుల్లో ఒకరు సైతం ఒప్పకున్నారు. వీరు మద్యం అమ్మకంతో పాటు ఆస్పత్రులు, విద్యాసంస్థలు సైతం నిర్వహిస్తున్నట్లు సీబీడీటీ వివరించింది.