తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Azadi Ka Amrit Mahotsav: బానిసత్వానికి తెరలేచిన రోజు.. - దేశ చరిత్రను మలుుపు తిప్పిన రోజు అక్టోబర్​ 22

అక్టోబర్​ 22.. భారతదేశానికి బానిసత్వాన్ని పరిచయం చేసిన రోజు! సుసంపన్నమైన సువిశాల భారతావనిని (Azadi Ka Amrit Mahotsav) ఆక్రమించుకోవడం ఆరంభించిన రోజు. దేశ సంపదను దోచుకోవడానికి రాచబాట పడిన రోజు. సొంత దేశంలోనే బానిసత్వానికి బాటలు పడిన రోజు.

october 22
అక్టోబరు 22

By

Published : Oct 22, 2021, 8:11 AM IST

అక్టోబరు 22... భారత చరిత్రను మలుపు తిప్పిన రోజు! అడుగుపెట్టడానికి చోటిస్తే ఆంగ్లేయులు ఆబగా ఆక్రమించటం ఆరంభించిన రోజు! మన 200 ఏళ్ల బానిసత్వానికి బాటలు వేసిన రోజు.

ప్లాసీ యుద్ధంతో బెంగాల్‌లో అడుగు మోపిన ఈస్టిండియా వర్తకులు... 1764 అక్టోబరు 22న మొదలైన బక్సర్‌ యుద్ధంతో మొత్తం బెంగాల్‌ను ఆక్రమించారు. యావత్‌ భారతావని (Azadi Ka Amrit Mahotsav) బ్రిటిష్‌ చేతుల్లోకి వెళ్లటానికి బలమైన పునాది పడిందిక్కడే!

ఆధునిక భారత చరిత్రలో అత్యంత కీలకమైంది బక్సర్‌ యుద్ధం! అప్పటి బెంగాల్‌లోని బక్సర్‌కు (ప్రస్తుతం బిహార్‌లో ఉందిది) సమీపంలో జరిగిన ఈ యుద్ధంలో ముగ్గురు మొఘల్‌ రాజులను ఓడించింది ఈస్టిండియా కంపెనీ. బెంగాల్‌ నవాబు మీర్‌ఖాసిం, అవధ్‌ నవాబు షుజ ఉద్‌ దౌలా, మొఘల్‌ చక్రవర్తి షా ఆలం-2లకు చెందిన సంయుక్త సేనలు... హెక్టార్‌ మున్రో సారథ్యంలోని ఈస్టిండియా సేన ముందు తేలిపోయాయి.

ఈస్టిండియా కంపెనీ భారత్‌లో అడుగుపెట్టేనాటికి బెంగాల్‌ అత్యంత సంపన్న ప్రాంతం. బిహార్‌, ఒడిశా ప్రాంతాలు కూడా అప్పుడు బెంగాల్‌లోనే కలిసుండేవి. 1757 ప్లాసీ యుద్ధంలో విజయంతో బెంగాల్‌లో అడుగుపెట్టింది ఈస్టిండియా. అయితే అప్పటికింకా తమకు పూర్తి పట్టు చిక్కకపోవటంతో మీర్‌ ఖాసింకు బెంగాల్‌ నవాబుగా మద్దతిచ్చారు. తొలుత ఆంగ్లేయుల మద్దతు తీసుకున్నా మెల్లగా ఖాసిం సొంత నిర్ణయాలు తీసుకోవటం మొదలెట్టాడు. అది బ్రిటిష్‌వారికి నచ్చలేదు. దీంతో విభేదాలు మొదలయ్యాయి. అవధ్‌ నవాబు, మొఘల్‌ చక్రవర్తిలదీ అదే పరిస్థితి. ఫలితంగా ముగ్గురూ కలసి ఆంగ్లేయులను కట్టడి చేయాలని భావించారు. యుద్ధం ప్రకటించారు. బక్సర్‌కు 6కిలోమీటర్ల దూరంలోని కట్‌కౌలి అనే ప్రదేశంలో ఈ యుద్ధం జరిగింది. మొఘల్‌ సేనల బలగం 40వేలు. ఈస్టిండియా సేనల సంఖ్య 10వేలు (ఇందులో ఆంగ్లేయులు 857 మందే). అయినా సమన్వయం లోపించిన మొఘల్‌ సేనల్ని కొద్దిగంటల్లోనే మట్టికరిపించింది ఈస్టిండియా కంపెనీ. మీర్‌ఖాసిం వాయవ్య భారతానికి పారిపోయి చనిపోగా... షా ఆలం-2 బ్రిటన్‌కు లొంగిపోయాడు. షుజ ఉద్‌ దౌలా అడపాదడపా పోరాడి తర్వాత తానూ పారిపోయాడు.

బక్సర్‌ యుద్ధంలో పరాజయంతో అలహాబాద్‌ ఒప్పందం అమలులోకి వచ్చింది. దాని ప్రకారం... యావత్‌ బెంగాల్‌ దివానీ హక్కులు (పన్నులపై హక్కు) ఈస్టిండియా కంపెనీకి దక్కాయి. నవాబులే వసూలు చేసినా... సొమ్మంతా తెల్లవారికే దక్కేది. అలా అప్పనంగా వచ్చిన భారీ సంపదతో... భారత్‌లోని ఇతర ప్రాంతాలకూ విస్తరించటం మొదలెట్టింది ఈస్టిండియా కంపెనీ.

ఇదీ చూడండి:Azadi Ka Amrit Mahotsav: ఓర్వలేక 'ఓడ'గొట్టారు!

ABOUT THE AUTHOR

...view details