Obulapuram Mines Case Investigation Updates: సుమారు పన్నెండేళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపిన ఓబుళాపురం గనుల కేసు విచారణ ప్రక్రియ వేగవంతమైంది. దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఉన్న నాంపల్లి సీబీఐ కోర్టు.. ప్రతిరోజూ సాక్షుల విచారణను కొనసాగిస్తోంది. ఈ కేసులోని నిందితుల డిశ్ఛార్జి పిటిషన్లను కొట్టివేసి అభియోగాలు నమోదు చేసిన న్యాయస్థానం.. రోజూ ఒకరు లేదా ఇద్దరు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేస్తోంది. ఈ ఒక్క (జూలై) నెలలోనే ఏకంగా 33 మంది సాక్షులను విచారించేందుకు షెడ్యూలు ఖరారు చేసి, సమన్లు జారీ చేసింది.
2011 డిసెంబరులో మొదటి చార్జిషీట్ దాఖలు.. అనంతపురం జిల్లా సరిహద్దుల్లో గనుల లీజులు, తవ్వకాల్లో అక్రమాలు జరిగాయన్న అభియోగంపై.. సీబీఐ 2011 డిసెంబరులో కర్ణాటక నేత గాలి జనార్దన్ రెడ్డి, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ఎండీ బీవీ శ్రీనివాస్ రెడ్డిపై మొదటి చార్జిషీట్ దాఖలు చేసింది. ఆ తర్వాత పరిశ్రమల శాఖ మాజీ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని అరెస్టు చేసింది. అనంతరం 2012 మార్చిలో ఆమెతో పాటు గనుల శాఖ మాజీ సంచాలకుడు వి.డి.రాజగోపాల్‌పై అనుబంధ అభియోగపత్రం సమర్పించింది.
సుప్రీంకోర్టు జోక్యంతో ఓఎంసీ కేసు విచారణ వేగవంతం.. ఆ తర్వాత గాలి జనార్దన్ రెడ్డి పీఏ మెర్‌ఫుజ్ అలీఖాన్‌పై 2013లో.. వైఎస్ హయాంలో గనుల శాఖ మంత్రిగా చేసిన ప్రస్తుత తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి కృపానందంపై 2014 ఏప్రిల్‌లో సీబీఐ కోర్టులో అనుబంధ చార్జిషీట్లు దాఖలు చేసింది. ఈ క్రమంలో దాదాపు పన్నెండేళ్ల క్రితం నమోదైన ఈ ఓబుళాపురం గనుల కేసు కొలిక్కి వచ్చే దిశలో వెళ్తోంది. సుప్రీంకోర్టు జోక్యంతో సీబీఐ కోర్టులో ఓఎంసీ కేసు విచారణ వేగవంతంగా జరుగుతోంది.
గాలి జనార్దన్ పిటిషన్‌పై సుప్రీం ఆగ్రహం.. అయితే, ఏళ్ల తరబడి ఈ కేసు విచారణ ప్రక్రియలో చెప్పుకోదగిన పురోగతి కనిపించిలేదు. నిందితుల డిశ్ఛార్జి పిటిషన్ల దశలోనే చాలా కాలం కొనసాగింది. అయితే.. గతేడాది బళ్లారి వెళ్లేందుకు అనుమతివ్వాలని కోరుతూ.. గాలి జనార్దన్ రెడ్డి వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏళ్ల తరబడి కేసు ఎందుకు ముందుకెళ్లడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. విచారణకు వివిధ దశల్లో గడువు విధించింది. నిందితుల డిశ్ఛార్జి పిటిషన్లను తేల్చేందుకు గతేడాది ఆగస్టు 29 నాటికి గడువు విధించింది.
88 వాంగ్మూలాల నమోదు, క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి..సుప్రీంకోర్టు ఆదేశాలతో.. సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సీహెచ్.రమేష్ బాబు రోజువారీ విచారణ చేపట్టి వేగం పెంచారు. నిందితులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీలక్ష్మి, రాజగోపాల్, కృపానందం, అలీఖాన్ డిశ్ఛార్జి పిటిషన్లను కొట్టివేస్తూ.. గతేడాది అక్టోబరు 17న సీబీఐ కోర్టు తీర్పులు వెల్లడించింది. అదే నెల 29వ తేదీన నిందితులందరిపై అభియోగాలు నమోదు చేసి.. సాక్షుల విచారణ ప్రక్రియను ప్రారంభించింది. డిశ్ఛార్జి పిటిషన్లను కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ.. సబితా ఇంద్రారెడ్డి, శ్రీలక్ష్మి, కృపానందం హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు.. శ్రీలక్ష్మిని కేసు నుంచి తొలగించగా.. సబితా ఇంద్రారెడ్డి, కృపానందం పిటిషన్లు పెండింగులో ఉన్నాయి. అయితే.. విచారణపై స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో సీబీఐ కోర్టు సాక్షుల విచారణ ప్రక్రియ వేగంగా నిర్వహిస్తోంది. సుమారు 180 మంది సాక్షులు ఉండగా.. వారిలో 88 వాంగ్మూలాల నమోదు, క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది.
సాక్షుల విచారణ కోసం షెడ్యూలు ఖరారు.. ఈ నేపథ్యంలో ప్రతీ రోజూ ఒకరు లేదా ఇద్దరు కొన్ని సందర్భాల్లో ముగ్గురు, నలుగురు సాక్షుల విచారణ కూడా జరుగుతోంది. విచారణకు హాజరుకాని సాక్షులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న న్యాయస్థానం.. ఒక దశలో కొందరు బెయిలబుల్ వారంట్లు కూడా జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. ముందుగా బళ్లారి, కర్ణాటకలోని ఇతర ప్రాంతాలకు చెందిన సాక్షుల విచారణను సీబీఐ కోర్టు పూర్తి చేసింది. విచారణ ప్రక్రియ పురోగతిని ఎప్పటికప్పుడు సుప్రీంకోర్టుకు నివేదిస్తున్న సీబీఐ కోర్టు.. మిగతా సాక్షుల విచారణకు కూడా షెడ్యూలు ఇచ్చింది. ఈ ఒక్క నెలలోనే 33 మంది సాక్షుల విచారణ కోసం షెడ్యూలు ఖరారు చేసి సమన్లు జారీ చేసింది. ఇదే వేగంతో కొనసాగితే.. మరికొన్ని నెలల్లోనే ఈ ఓఎంసీ కేసు తేలిపోతుందని న్యాయవాదులు అంచనా వేస్తున్నారు.