Nursing Student Brutal Murder in Vikarabad : వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. కాడ్లాపూర్ గ్రామంలో నిన్న అదృశ్యమైన యువతి.. తెల్లారేలోగా దారుణ హత్యకు గురైంది. గ్రామానికి చెందిన జంగయ్య, యాదమ్మ దంపతుల కుమార్తె శిరీష.. పారామెడికల్ చదువుతోంది. తల్లి యాదమ్మకు ఇటీవల గుండెపోటు రావటంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతోంది. ఈ క్రమంలోనే నిన్నటి నుంచి శిరీష కనిపించకుండా పోయింది.
కుటుంబ సభ్యులు, గ్రామస్థులు, బంధువుల ఇళ్ల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలోనే ఉదయం కాడ్లాపూర్ శివారులోని ఓ కుంటలో గుర్తు తెలియని శవం కనిపించింది. గమనించిన గ్రామస్థులు శిరీషనే హత్యకు గురైనట్లు గుర్తించారు. ఓ కన్ను పీకేసి.. కాళ్లు, చేతులను కత్తులతో కోసి, పాశవికంగా యువతిని హత మార్చారు. అనంతరం మృతదేహాన్ని కుంటలో పడేసి వెళ్లిపోయారు. గ్రామస్థుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కుంట వద్ద ఆధారాలు సేకరించారు.
"మా కుమార్తె రాత్రి ఇంటి నుంచి వెళ్లింది. ఆ తరువాత తిరిగి ఇంటికి రాలేదు. తెలిసిన వారు, బంధువులను అడిగాం. ఎక్కడా ఆచూకీ దొరకలేదు. ఇంతలో మా ఊరు చివర ఉన్న చిన్న కుంటలో శవమై కనిపించింది. శవంపై కళ్లు పొడిచి ఉన్నాయి. మెడ, శరీరంపై కత్తి గాట్లు ఉన్నాయి". - జగ్గయ్య, శిరీష తండ్రి