కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు '#స్పీక్అప్టుసేవ్లైవ్స్'(ప్రాణాలను కాపాడేందుకు గళం విప్పండి) పేరిట కాంగ్రెస్ పార్టీ ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం దేశంలో ఉన్న విపత్కర పరిస్థితుల్లో ఆపన్నహస్తం అందించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రాణాలను కాపాడేందుకు ప్రతిఒక్కరు తోచిన విధంగా సాయపడాలని పిలుపునిచ్చారు.
దేశంలో ఆక్సిజన్, ఔషధాలు, పడకలకు కొరత ఏర్పడిందని, టీకాలూ అందుబాటులో లేవని కాంగ్రెస్ పేర్కొంది. కాంగ్రెస్ సహా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన సలహాలను సైతం మోదీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదని విమర్శించింది. మెడికల్ ఆక్సిజన్ సరఫరా నిరంతరం కొనసాగడం సహా ప్రతి పౌరుడికీ టీకాను ఉచితంగా అందించాలని డిమాండ్ చేసింది.