దేశంలో కరోనా టీకా స్వీకరించిన వారి సంఖ్య.. యాక్టివ్ కేసులతో పోలిస్తే రెట్టింపు ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు 4,54,049 మందికి టీకా అందించినట్లు వెల్లడించింది. 24 గంటల వ్యవధిలో 2,23,669 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు పేర్కొంది.
టీకా ప్రతికూల ప్రభావాలపై ఇప్పటివరకు ఎలాంటి తీవ్రమైన కేసులు నమోదు కాలేదని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. రెండు వ్యాక్సిన్లు అత్యంత సురక్షితంగా పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ తర్వాత 0.18 శాతం మందిలో మాత్రమే దుష్ప్రభావాలు తలెత్తాయని కేంద్ర వైద్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ వెల్లడించారు. 0.002 శాతం మందికి మాత్రమే ఆస్పత్రుల్లో చికిత్స అవసరమైందని పేర్కొన్నారు. ఇది ప్రపంచంలోనే అతి తక్కువ అని వివరించారు.
తగ్గుతున్న సంక్రమణం
మరోవైపు, దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోందని కేంద్ర వైద్య శాఖ పేర్కొంది. యాక్టివ్ కేసుల సంఖ్య రెండు లక్షలకు పరిమితమైందని వెల్లడించింది. మొత్తం కేసుల్లో ఇది 1.90 శాతం మాత్రమేనని తెలిపింది. అదే సమయంలో రోజువారీ కేసులు అతి తక్కువ స్థాయికి పడిపోయాయని వివరించింది. మంగళవారం 10,064 కేసులు నమోదయ్యాయని పేర్కొంది. ఇది ఏడు నెలల కనిష్ఠమని స్పష్టం చేసింది.
కొత్త స్ట్రెయిన్ కేసులు 141
భారత్‌లో వీక్లీ పాజిటివిటీ రేటు 1.97 శాతానికి పరిమితమైందని తెలిపింది కేంద్ర వైద్య శాఖ. 22 రాష్ట్రాల పాజిటివిటీ రేటు దేశ సగటు కన్నా తక్కువగా ఉందని వెల్లడించింది. కొత్త కేసుల్లో 71 శాతం ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచే ఉన్నాయని పేర్కొంది. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో తీవ్రత అధికంగా ఉందని తెలిపింది. కాగా దేశంలో కరోనా కొత్త స్ట్రెయిన్ కేసుల సంఖ్య 141కి పెరిగింది.
ఇదీ చదవండి:కాకికి బర్డ్‌ఫ్లూ- ఎర్రకోట బంద్