NEET EXAM: కేరళలో నీట్ పరీక్ష సమయంలో కొందరు అమ్మాయిలతో లోదుస్తులు విప్పించిన వివాదంలో జాతీయ పరీక్షల మండలి(నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆ అమ్మాయిలకు మరోసారి పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. బాధిత అమ్మాయిలకు సెప్టెంబరు 4వ తేదీన నీట్ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఆయా విద్యార్థినులకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం చేరవేసినట్లు ఎన్‌టీఏ తెలిపింది.
ఈ ఏడాది జులై 17న నీట్ పరీక్ష సమయంలో తనిఖీల పేరుతో తమను లోదుస్తులు విప్పాలని సిబ్బంది బలవంతం చేసినట్లు కొందరు విద్యార్థినులు ఫిర్యాదు చేయడం అప్పట్లో పెను దుమారం రేపింది. కేరళలోని కొల్లం జిల్లా ఆయుర్‌లో గల మార్థోమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. తనిఖీల సమయంలో లోదుస్తులకు ఉన్న హుక్స్ కారణంగా సౌండ్ వచ్చిందని దీంతో దాన్ని తీసేసి తన కుమార్తెను పరీక్షా కేంద్రంలోకి వెళ్లాలని సిబ్బంది ఆదేశించారని ఓ విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పలువురు విద్యార్థినులు కూడా ఇదే తరహా ఫిర్యాదులు చేశారు.