తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జేఈఈ, నీట్‌ ర్యాంకుల కేటాయింపులో కీలక మార్పు - NEET JEE Main rankings

జేఈఈ మెయిన్‌, నీట్‌ ర్యాంకుల(JEE rank) కేటాయింపుల్లో ఈసారి కీలక మార్పు చేసింది ఎన్‌టీఏ. ఇప్పటివరకు వయసు ఎక్కువ ఉన్న వారికి ప్రాధాన్యం ఇచ్చి ముందు ర్యాంకు కేటాయిస్తుండగా, ఈసారి  వయసును మినహాయించింది.

NTA Removes Age Factor From Tie-Breaking Policy. Brings Major Changes
జేఈఈ, నీట్‌ ర్యాంకుల కేటాయింపులోకీలక మార్పు

By

Published : Aug 28, 2021, 9:00 AM IST

జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ).. జేఈఈ మెయిన్‌, నీట్‌ ర్యాంకుల కేటాయింపుల్లో ఈసారి కీలక మార్పు చేసింది. ఇద్దరికి సమాన మార్కులు వచ్చిన పక్షంలో వయసును పరిగణనలోకి తీసుకునే పద్ధతికి స్వస్తి పలికింది. ఇప్పటి వరకు వయసు ఎక్కువ ఉన్న వారికి ప్రాధాన్యం ఇచ్చి ముందు ర్యాంకు కేటాయిస్తుండగా, ఈసారి వయసును మినహాయించింది. బదులుగా తక్కువ తప్పులు చేసిన వారికి.. అంటే నెగెటివ్‌ మార్కులు తక్కువ పొందిన వారికి ర్యాంకు కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని ఎన్‌టీఏ నిర్ణయించింది.

జేఈఈ మెయిన్‌లో ఇలా...

కొత్త విధానం ప్రకారం జేఈఈ మెయిన్‌లో ఇద్దరు అభ్యర్థులకు ఒకే స్కోర్‌ వస్తే మొదట గణితం, తర్వాత భౌతికశాస్త్రం, అనంతరం రసాయన శాస్త్రం మార్కులను పరిశీలిస్తారు. మూడింటిలోనూ ఇద్దరికి సమాన మార్కులు వచ్చిన పక్షంలో తర్వాత నెగటివ్‌ మార్కులను చూస్తారు. ఎవరికి తక్కువ ఉంటే వారికి ర్యాంకులో ప్రాధాన్యం ఉంటుంది. నెగెటివ్‌ మార్కులు కూడా సమానంగా ఉంటే ఇద్దరికీ ఒకే ర్యాంకు కేటాయిస్తారు. ప్రస్తుతం చివరి విడత పరీక్షలు జరుగుతున్నాయి. సెప్టెంబరు 2వ తేదీతో పరీక్షలు ముగుస్తాయి. నాలుగు విడతల్లో ఎక్కువ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుని, కొత్త విధానంలో ర్యాంకు కేటాయిస్తారు.

నీట్‌లో ఇలా...

వచ్చే నెల 12వ తేదీ జరగబోయే నీట్‌లో ఇద్దరికి సమాన మార్కులు వస్తే మొదట జీవశాస్త్రం(వృక్ష, జంతుశాస్త్రాలు) మార్కులను పరిశీలిస్తారు. అందులోనూ ఒకేలా ఉంటే తర్వాత కెమిస్ట్రీ, అటు తర్వాత భౌతికశాస్త్రం మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. చివరగా నెగెటివ్‌ మార్కులు ఎవరికి తక్కువగా ఉంటే వారికి ర్యాంకు కేటాయింపులో ప్రాధాన్యం ఇస్తారు.

అభ్యర్థులూ...పారాహుషార్‌

సాధారణంగా నీట్‌ రాసే వారిలో కనీసం 30-40 శాతం మంది పాత విద్యార్థులు(గతంలో ఇంటర్‌ ఉత్తీర్ణులైనవారు) ఉంటారు. దీర్ఘకాల శిక్షణ తీసుకుని రెండు మూడు ఏళ్లుగా ప్రయత్నించే వారూ ఉంటారు. ఇప్పటివరకు ఉన్న వయసు ప్రాధాన్యం వారికి బాగా ఉపయోగపడేది. కొత్త విధానంలో ఆ వెసులుబాటు ఉండదని, అదే సమయంలో అభ్యర్థులు నెగెటివ్‌ మార్కులను దృష్టిలో పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘నీట్‌లో సరైన జవాబుకు నాలుగు మార్కులు ఇస్తారు. తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు. చాలా మంది వస్తే నాలుగు...పోతే ఒకటి అనే పద్ధతిని అనుసరిస్తారు. ఈసారి అది మరింత నష్టం చేస్తుందని’ హెచ్చరిస్తున్నారు.

ఇదీ చూడండి:ఒక్కరోజులో కోటి డోసులు- భారత్​ రికార్డు

ABOUT THE AUTHOR

...view details