కుమార్తె వివాహం కోసం యూకే నుంచి నోయిడా వచ్చిన ఓ ఎన్నారై దాదాపు రూ. 1 కోటి విలువ చేసే నగలను ఉబర్ క్యాబ్‌లో మర్చిపోయారు. అయితే, నాలుగు గంటలపాటు తీవ్రంగా శ్రమించిన పోలీసులు ఎట్టకేలకు నగలను స్వాధీనం చేసుకొని అతడికి అందజేశారు. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో జరిగింది. నోయిడా పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిఖిలేశ్‌కుమార్ సిన్హా అనే వ్యక్తి లండన్‌లో ఉంటున్నారు. కుమార్తె వివాహం కోసం ఇటీవలే నోయిడాకు వచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి గురువారం గౌర్ పట్టణ ప్రాంతంలోని హోటల్‌కు క్యాబ్‌లో చేరుకున్న తర్వాత లగేజీలో ఓ బ్యాగ్ మిస్సయినట్లు గుర్తించారు. అందులోనే నగలు, కొన్ని విలువైన వస్తువులు ఉన్నాయి. క్యాబ్‌లోనే మర్చిపోయి ఉండొచ్చన్న అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కూతురు పెళ్లి కోసం తెచ్చిన రూ.కోటి నగల బ్యాగ్ క్యాబ్‌లో మర్చిపోతే.. - 1 కోటి నగలను ఉబర్ క్యాబ్‌లో మర్చిపోయిన ఎన్ఆర్ఐ
నోయిడాకు చెందిన ఎన్నారై ఓ క్యాబ్‌లో రూ.కోటి విలువైన నగలను మర్చిపోయారు. ఆయన ఫిర్యాదు మేరకు క్యాబ్ డ్రైవర్ మొబైల్ నంబర్‌ను ట్రాక్ చేసిన పోలీసులు బ్యాగ్‌ను స్వాధీనం చేసుకొని తిరిగి ఆ వ్యక్తికి అందజేశారు.
బుకింగ్ సమయంలో ఉబర్ క్యాబ్ డ్రైవర్ కాల్ చేయడంతో.. ఆ నెంబర్‌ను పోలీసులకు ఇచ్చారు. అప్రమత్తమైన పోలీసులు గుడ్‌గావ్‌లోని ఉబర్ కార్యాలయం నుంచి క్యాబ్ లైవ్ లొకేషన్‌ను ట్రాక్ చేసి ఘజియాబాద్‌లో ఉన్నట్లు గుర్తించారు. పోలీసుల బృందం లాల్‌కువాన్ ప్రాంతంలో క్యాబ్ డ్రైవర్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. కారు డిక్కీలో బ్యాగ్ ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అయితే, కారులో బ్యాగ్ ఉన్నట్లు తనకు తెలియదని క్యాబ్ డ్రైవర్ పోలీసులకు తెలిపాడు. బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు తాళం తెరవకుండానే నిఖిలేశ్ కుమార్ కుటుంబసభ్యులకు అందజేశారు. ఆభరణాలన్నీ ఉన్నాయని చెబుతూ.. పోలీసుల కృషిని వారు అభినందించారు.