తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే పోటాపోటీగా దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా మహిళా ఓటర్ల కోసం ఆకర్షణీయ పథకాలను ప్రకటించాయి. తాము అధికారంలోకి వస్తే గృహిణులకు ప్రతి నెలా రూ.1000 ఆర్థిక సాయంగా అందిస్తామని డీఎంకే ప్రకటించిన మరునాడే.. తమను మళ్లీ గెలిపిస్తే మహిళలకు నెల నెలా రూ.1500 సాయం అందిస్తామని అన్నాడీఎంకే ప్రకటించింది. ఈ మేరకు సీఎం కే పళనిస్వామి.. మహిళా దినోత్సవం రోజున హామీ ఇచ్చారు.
అయితే ఈ పథకాన్ని తాము డీఎంకే నుంచి కాపీ చేయలేదని పళనిస్వామి తెలిపారు. తమ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని 10 రోజుల క్రితమే చేర్చామని, అది లీకై డీఎంకేకు తెలిసి ఉంటుందని చెప్పారు. అందుకే వారు ముందుగా ప్రకటించారని అన్నారు.