పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అవకాశమే లేదని భాజపా ఎంపీ సుశీల్ కుమార్ మోదీ స్పష్టం చేశారు. వచ్చే 8-10 సంవత్సరాల వరకు ఇది సాధ్యం కాదని తేల్చి చెప్పారు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే వార్షికంగా రూ.2 లక్షల కోట్ల రెవెన్యూ నష్టం ఏర్పడుతుందని తెలిపారు.
ఆర్థిక బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్యసభలో మాట్లాడిన సుశీల్.. పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా కేంద్ర, రాష్ట్రాలు కలిసి రూ.5 లక్షల కోట్ల పన్ను వసూలు చేశాయని తెలిపారు.
"వచ్చే 8-10 సంవత్సరాల వరకు పెట్రోల్-డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం సాధ్యం కాదు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే... 28 శాతం పన్ను విధించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వీటిపై 60 శాతం పన్ను ఉంది. జీఎస్టీ పరిధిలోకి వస్తే.. కేంద్రం, రాష్ట్రాలకు రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.2.5 లక్షల కోట్ల మధ్య నష్టం ఏర్పడుతుంది. వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే రూ.2 లక్షల కోట్ల రెవెన్యూ లోటు ఎలా భర్తీ అవుతుంది?"